టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్యకు మూడు తరాల ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సాయిపల్లవి డాన్స్ కు ‘ఫిదా’ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.
ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో ఫిట్ నెస్ బేస్డ్ డాన్స్ ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తుంటాడు. అదే ఊరికి చెందిన పటేల్ బిడ్డ మౌనిక ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఒకే వీధిలో ఉండే వీరి మధ్య, అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. పల్లెలో వేళ్ళూనుకున్న కులోన్మాదం కారణంగా వీరిద్దరి ‘లవ్ స్టోరీ’ ఎన్ని మలుపులు తిరిగిందన్నదే చిత్ర కథ.
‘డాలర్ డ్రీమ్స్’తో తొలిసారి మెగా ఫోన్ పట్టి, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత మంచి కాఫీలాంటి సినిమాగా ‘ఆనంద్’ను అందించాడు. ఆ పైన వచ్చిన ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రాలతో ఇటు యూత్ కు, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ మనసు దోచుకున్నాడు. ‘కహానీ’ రీమేక్ ‘అనామిక’తో కాస్తంత గాడి తప్పినా, తిరిగి ‘ఫిదా’తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే.. ఇంతవరకూ శేఖర్ కమ్ముల తీసిన చిత్రాలకు కాస్తంత భిన్నమైన సినిమా ‘లవ్ స్టోరీ’. ఇందులో ప్రేమకథను మాత్రమే మాత్రమే శేఖర్ కమ్ముల డీల్ చేయలేదు. కుల వివక్షత, మహిళా సాధికారికతతో పాటు చైల్డ్ ఎబ్యూజ్ గురించి కూడా చర్చించాడు. దానికి అనుగుణంగానే కథను ముప్పేట గొలుసులా తయారు చేశాడు. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాలను చూడటానికి అలవాటు పడిన వారికి తనలోని మరో కోణాన్ని చూపించాడు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన కుల వివక్షతను, మహిళల నిస్సహాయతను, చాపకింద నీరులా ఉన్న చైల్డ్ ఎబ్యూజ్ ను వెండితెరపై ఆవిష్కరించాడు. దర్శకుడు ఎంచుకున్న మూడు అంశాలు తీవ్రమైనవి. దాంతో వాటిని కన్వెన్సింగ్ గా, ఆడియెన్స్ కు కమ్యూనికేట్ చేయడంలో శేఖర్ కమ్ముల తడబడ్డాడు.
కథానాయకుడు రేవంత్ లక్ష్యం ఒకటైతే, అతని ప్రయాణం మరో వైపు సాగిపోయింది. అక్కడే కథ ట్రాక్ తప్పింది. తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపించుకోవడంలోనే తన ఆత్మగౌరవం ముడిపడి ఉందని రేవంత్ తల్లి భావిస్తుంది. అలాంటి ఆమె కొడుకు చేతిలో పొలం కాగితాలు పెడితే, దాని ద్వారా ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభించిన రేవంత్ క్షణాలలో దాన్ని మూసేసి, ప్రేమకోసం దుబాయ్ వెళ్ళాలనుకోవడంలో అతని క్యారెక్టరైజేషన్ పలచబడిపోయింది. బాల్యం నుండి ఫిజికల్ ఎబ్యూజ్ కు గురి అవుతున్న మౌనిక దానికి కారణమైన వ్యక్తి గురించి కనీసం తల్లికి చెప్పుకునే ప్రయత్నం చేయకపోవడం నమ్మశక్యంగా అనిపించదు. రేవంత్ తో కలిసి దేశం వదలి పారిపోవడం కోసం మౌనిక ఎస్.ఐ. తో కలిసి ఆడే ఆట థ్రిల్ కలిగించకపోగా, టైమ్ పాస్ వ్యవహారంగా మారిపోయింది. తన హైస్కూల్ మేట్ బల్లి మెంటాలిటీ తెలిసిన మౌనిక, అతని చెప్పుడు మాటలు విని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రేవంత్ ను ‘మీరు – మేము’ అంటూ విడదీసి మాట్లాడటంతో ఆమె క్యారెక్టరైజేషన్ లో జన్యూనిటీ దెబ్బతింది. ఇక రేవంత్ ఊరి నుండి పారిపోయే క్రమంలో శ్మశానంలోకి వెళ్లడం, అక్కడ కుల వివక్షత గురించి తల్లితో మాట్లాడే సన్నివేశం… కావాలని అతికించినట్టుగా ఉంది. కుల వివక్షత గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ యేడాది కూడా ‘ఉప్పెన, శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించారు. ఇది అదే కోవకు చెందిన సినిమా. ‘ఉప్పెన’లో మాదిరే ఇందులోనూ హీరో కన్వర్టెడ్ క్రీస్టియన్. అయితే… చైల్డ్ ఎబ్యూజ్ అంశాన్ని ఇంత బోల్డ్ గా తెలుగు సినిమాల్లో చూపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. దీన్ని ప్రేక్షకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు మనసులోకి ఎక్కించుకుంటే మంచిదే! పుస్కర్ రామ్ మోహన్ రావు, నారాయణ దాస్ కె నారంగ్ నిర్మించిన ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
‘లవ్ స్టోరీ’కి ప్రధాన బలం నటీనటులు, సాంకేతిక నిపుణులు. సంభాషణలు హృదయానికి హత్తుకునేలా, ఆలోచింప చేసేలా ఉన్నాయి. క్లయిమాక్స్ లో మౌనిక కాలి చెప్పుతీసి హెచ్చరించేది కేవలం తన నానమ్మను కాదు… ఈ సమాజంలోని వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులను! ఆమె చెప్పిన ఆ డైలాగ్స్ కు థియేటర్స్ లో క్లాప్ పడుతున్నాయి. విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ, పవన్ సిహెచ్ నేపథ్య సంగీతం చక్కగా ఉన్నాయి. ఇప్పటికే యూ-ట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘సారంగ దరియా’ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. హీరోయిన్ డాన్స్ టాలెంట్ ను తెలియచేస్తూ సాగే ‘ఏవో ఏవో కలలే’ సాంగ్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. రేవంత్ పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయాడు. సాయిపల్లవి అయితే ప్రాణం పెట్టింది. నిజానికి ఆమె పాత్రలో ఉన్నన్ని వేరియేషన్స్ మరే పాత్రలోనూ లేవు. ఆ యా సందర్భాలకు అనుగుణంగా తన అభినయాన్ని ప్రదర్శించింది సాయిపల్లవి. హీరో తల్లిగా ఈశ్వరీరావు, హీరోయిన్ బాబాయిగా రాజీవ్ కనకాల చక్కగా నటించారు. రాజీవ్ కనకాలకు ఇది సమ్ థింగ్ స్పెషల్ క్యారెక్టర్. ఎస్.ఐ. గా ఉత్తేజ్ కనిపించేది నాలుగైదు సీన్స్ అయినా అదీ కీలక పాత్రే! హీరోయిన్ తల్లిగా నటించిన దేవయానికి క్లయిమాక్స్ లోనే కాస్తంత నటించే ఛాన్స్ దక్కింది. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఆర్టిస్టులంతా చక్కగా నటించారు.
ప్రథమార్థం శేఖర్ కమ్ముల మార్క్ ప్రేమకథతో సాగిన ఈ సినిమా, ద్వితీయార్థంలో అసలు కథలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఒక్కో చిక్కుముడిని విడిపించే క్రమంలో దర్శకుడు తాను చెప్పదల్చుకున్న అంశాన్ని బలంగా చెప్పలేకపోయాడు. ఇన్ని సమస్యలను ఒకే సినిమాలో తీసుకోకుండా ఉంటే బాగుండేది. ‘లవ్ స్టోరీ’ అనే పేరు చూసి, శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డ్ ను చూసి థియేటర్లకు వెళ్ళే వారికి నిరాశను కలిగించే చిత్రమిది!
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ప్రొడక్షన్ వ్యాల్యూస్
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
మైనెస్ పాయింట్
కన్వెన్సింగ్ గా లేని క్లయిమాక్స్
శేఖర్ కమ్ముల మ్యాజిక్ మిస్
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: కన్ఫూజింగ్ ‘లవ్ స్టోరి’!