మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందుకు వచ్చినా, ‘మహానటి’తో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నాడు. గత యేడాది అతను నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో తొలిసారి శుక్రవారం విడుదలైంది.
కేరళకు చెందిన క్రిమినల్ సుకుమార కురుప్. రకరకాల నేరాలను చేసిన అతను చివరిగా తానే చనిపోయినట్టు ఎల్. ఐ.సి. సంస్థను నమ్మించి ఎనిమిది లక్షలను తీసుకుని అంతర్థానమయ్యాడు. ఇది 1984లో జరిగింది. అప్పటి నుండీ ఇప్పటి వరకూ సుకుమార కురుప్ ఆచూకీని పోలీసులు తెలుసుకోలేకపోయారు. అతను ఏమయ్యాడో కూడా తెలియలేదు. ఆ వ్యక్తి జీవితాన్ని దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ పేరుతో సినిమాగా తీశాడు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దుల్కరే నిర్మాత కూడా కావడం విశేషం. ఓ క్రిమినల్ కథను వెండితెరపై హీరోలా చూపించబోతున్నారనే విమర్శ మూవీ ప్రారంభమైన సమయంలో బాగా వచ్చింది. అయితే కురుప్ ను హీరోగా చూపడం లేదని, అతనిలోని విలనిజాన్ని యథాతథంగా తెరపై చూపబోతున్నామని దుల్కర్ వివరణ ఇచ్చాడు. అదే మాట మీద కూడా నిలబడ్డాడు కూడా! వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ స్టోరీని తెరకెక్కించే విధానంలో దర్శకుడు కొంత స్వేచ్ఛనూ తీసుకున్నాడు. జీవితంలో ఎత్తుకు చేరుకోవాలనే అత్యాశ ఉన్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి గోపీకృష్ణన్ కురుప్ కథగా దీన్ని దర్శకుడు మలిచాడు. జీకే అనే ఓ సాధారణ వ్యక్తి, ఆ తర్వాత సుధాకర్ కురుప్ గా, ఆపైన అలెగ్జాండర్ గా ఎలా మారాడు? అనే అంశాలను ఆసక్తి కరంగా మలిచాడు. జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి జీవితం ఎలా పక్కదారులు పడుతుందో చూపించాడు. అయితే ఒకానొక సమయంలో లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్న ఆ క్రిమినల్ ప్రయత్నాలు ఎలా బెడిసి కొట్టాయో థ్రిల్ కు గురయ్యేలా చూపడం ఈ సినిమాకు సంబంధించిన అసలు సిసలు విశేషం.
కురుప్ గా దుల్కర్ సల్మాన్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిజాన్ని చూపించకుండా, ఓ క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆపత్కర పరిస్థితులలో అలాంటి వారు ఎలా ప్రవర్తిస్తారు అనేది దుల్కర్ చక్కగా చేశాడు. అతని ప్రేయసి శారదాంబగా తెలుగు అమ్మాయి శోభిత బాగా నటించింది. అలానే కురుప్ ను వెంటాడే పోలీస్ అధికారి పాత్రను ఇంద్రజిత్ సుకుమారన్ సమర్థవంతంగా పోషించాడు. సినిమా ప్రథమార్థం కాస్త బోర్ కొట్టినా, ద్వితీయార్థంకు వచ్చే సరికీ ముఖ్యంగా క్లయిమాక్స్ సీన్స్ ఆడియెన్స్ ను కట్టిపడేస్తాయి. సాంకేతిక నిపుణుల పనితనం చెప్పుకోదగ్గదే. దాంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. విశేషం ఏమంటే ఇది దాదాపు నలభై యేళ్ళ క్రితం కథ కావడంతో, అప్పటి కాలానికి అనుగుణంగా సన్నివేశాల రూపకల్పనకు డైరెక్టర్ శ్రీనాథ్ గట్టి హోమ్ వర్క్ చేసిన విషయం మనకు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని సన్నివేశాలు కాస్తంత కంగాళీగా ఉన్నా, ఓవర్ ఆల్ గా ‘కురుప్’ క్రైమ్ థిల్లర్స్ ను ఇష్టపడే వారికి నచ్చే సినిమా!
ప్లస్ పాయింట్స్
నటీనటులు నటన
దర్శకుడి టేకింగ్
కట్టిపడేసే క్లయిమాక్స్
మైనస్ పాయింట్స్
బోర్ కొట్టించే ప్రథమార్ధం
క్లారిటీ లేని కొన్నిసీన్స్
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: బీమా చేసిన క్రైమ్ డ్రామా!