ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే… మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసిన మూవీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ‘నీలీ నీలీ ఆకాశం’ పాట ఇలా విడుదలైందో లేదో… అలా జనంలోకి వెళ్ళిపోయింది. సాంగ్ రిలీజ్ అయ్యి యేడాది గడిచే సరికీ… త్రీ హండ్రెస్ ప్లస్ మిలియన్ వ్యూస్ ను ఈ పాట దక్కించుకుందంటే… ఏ స్థాయిలో అది హిట్ అయ్యిందో ఊహించుకోవచ్చు… దాంతో సహజంగానే మూవీ మీద అంచనాలూ భారీగా పెరిగిపోయాయి. పైగా ఈ వీకెండ్ విడుదలైన మూవీస్ లో హైప్ ఉన్నది ఇదే కావడంతో… అందరి దృష్టీ దీని మీదే ఉంది… మరి ఆ స్థాయిలో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ఉందో లేదో తెలుసుకోవడానికి డీటేల్స్ లోకి వెళ్దాం…
1947లో అంటే… అప్పటికీ మనకు స్వాతంత్రం రాకముందు… ఉత్తరాంధ్రలోని ఓ మారుమూల పల్లెలోని ఓ అబ్బాయి గారు… అమ్మాయి గారూ ప్రేమించుకుంటారు. అబ్బాయిగారికి ఆ అమ్మాయి మీద ప్రేమతో పాటు… కుస్తీ పోటీలంటే పిచ్చి… బ్రిటీషర్స్ ను కుస్తీ పోటీల్లో ఓడించి… బహుమతిగా వచ్చే డబ్బుతో అమ్మాయి గారికి బంగారు గాజులు చేయించాలనుకుంటాడు. కానీ అతను ఒకటి తలిస్తే… దైవం వేరొకటి తలుస్తుంది. ఇక ప్రెజెంట్ కు వస్తే… ఆ ఇద్దరూ ఇప్పుడు అర్జున్ అండ్ అక్షరగా మళ్ళీ పుడతారు. వైజాగ్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరతారు. మరి వీరిద్దరి మధ్య ’30 రోజుల్లో ప్రేమ’ అనేది ఎలా పుట్టింది? అసలు ఎందుకు ప్రేమ పుట్టాల్సి వచ్చింది? అన్నది మిగతా కథ…
సహజంగా ఏ ఆర్టిస్ట్ అయినా హీరోగా పరిచయం కావాలనుకున్నప్పుడు… డాన్సులు, ఫైట్స్ చేసి… జనాలను మెప్పించాలనుకుంటాడు. కానీ యాంకర్ ప్రదీప్ ఈ రెండే కాకుండా… నటనతోనూ మార్కులకు కొట్టేయాలనుకున్నాడు. అతనికి యాంకర్ గా కొంత ఇమేజ్ ఉండటంతో దానికి తగ్గ కథనే ఎంచుకున్నాడు. ప్రథమార్థం అంతా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా, రెండు జన్మల కథగా సాగినా… ద్వితీయార్థంలో అంతకు మించిన టర్న్ తీసుకుంది. అక్కడ నుండి ఇటు ప్రదీప్, అటు హీరోయిన్ అమృత అయ్యార్ పాత్రల పోషణ కీలకమైపోయింది. దానికి తోడు ఇటు మదర్ సెంటిమెంట్, అటు డాటర్ సెంటిమెంట్ ను కూడా డైరెక్టర్ మున్నా ఇందులో మిక్స్ చేశాడు.
ప్రదీప్ నటనలో చాలా ఈజ్ ఉంది. సరదా సన్నివేశాల్లోనే కాదు… సెంటిమెంట్ సన్నివేశాల్లోనూ మెప్పించి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. అలానే ‘రెడ్’లో అమాయకపు అమ్మాయిగా నటించిన అమృతా అయ్యర్ ఈ మూవీతో తనలోని ఇంకో యాంగిల్ ను చూపించింది.. హీరో తల్లిదండ్రులుగా హేమ, శివన్నారాయణ, హీరోయిన్ తండ్రిగా పోసాని నటించారు. హీరో స్నేహితులుగా వైవా హర్ష, భద్రం కామెడీ పండించే ప్రయత్నం చేశారు. శుభలేఖ సుధాకర్, ఆచంట మహేశ్ గురుశిష్యులుగా నటించారు.
టెక్నీషియన్ల విషయానికి వస్తే… ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ప్రధాన కారకుడు అనూప్ రూబెన్స్. ఒకే ఒక్క పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. మరో రెండు పాటలు కూడా క్యాచీ లిరిక్స్ తో బాగున్నాయి. ద్వితీయార్థంలో వచ్చే అమ్మ పాట కూడా ఓకే… అర్థవంతమైన లిరిక్స్ ఉన్నాయి. అంతేకాదు అనూప్ రీ-రికార్డింగ్ కూడా సూపర్… అరకు అందాలతో పాటు… సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ను కలర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం సినిమాటోగ్రాఫర్ శివేంద్ర చేశాడు. డైరెక్టర్ మున్నా రాసిన మాటలూ బాగున్నాయి. అయితే… సినిమాలో అనసవరమైన సీన్స్ చాలా ఉన్నాయి… చకచకా సాగుతున్న కథను ట్రాక్ తప్పించిన కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ను ప్రవీణ్ మొహమాట పడకుండా కట్ చేసి ఉంటే బాగుండేది. మరీ ముఖ్యంగా ‘పటాస్’లోని కామెడీ ట్రాక్ ను ఇమిటేట్ చేస్తూ… హాస్టల్స్ లో ఉండే కూతుళ్ళుకు మదర్స్ క్లాస్ పీకడం ఎబ్బెట్టుగా ఉంది… అవన్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేవే!
ఇటు హీరోగా ప్రదీప్ కు, అటు డైరెక్టర్ మున్నాకు ఇది మొదటి సినిమా కావడంతో అన్నప్రాసన రోజే ఆవకాయ తినాలని చూశారు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చాయో లేదో తెలియదు కానీ… సినిమా చూసే ప్రేక్షకుల కళ్ళలో మాత్రం నీరసం రావటం ఖాయం. సినిమా అంటే లాజిక్ లేనిదనే విషయం అందరూ అంగీకరించేదే… అయితే రొటీన్ ఎంటర్ టైనింగ్ సీన్స్ కాకుండా కాస్త కొత్తగా తీసి ఉంటే… బాగుండేది. నిర్మాత ఎస్వీ బాబు ఖర్చు విషయంలో వెనకాడకపోయినా… దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కలేదనిపిస్తోంది.
ఫైనల్ గా చెప్పుకోవాలంటే… ఊహించని హైప్ ఈ సినిమాకు శాపమనే చెప్పాలి. ఏతా వాతా ఫస్ట్ హాఫ్ యూత్ ని ఆకట్టుకున్నా…. ద్వితీయార్థం తర్వాత నిరాశతో బయటకు వస్తాం. మరి వేరే పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం తో పాటు ప్రదీప్ ఇమేజ్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్… ఏదైనా మ్యాజిక్ చేసి… మూవీని గట్టెక్కిస్తాయేమో చూడాలి.
ప్లస్ పాయింట్స్
ప్రదీప్ ఈజ్
ఆకట్టుకునే ప్రథమార్ధం
అనూప్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
బోరు కొట్టే ద్వితీయార్థం
ఆకట్టుకోని ఎంటర్ టైన్ మెంట్
పండని సెంటిమెంట్
బోటమ్ లైన్
ఓటీటీకి ఎక్కువ…. థియేటర్ కు తక్కువ