Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?

Cd

Cd

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రెండున్నరేళ్ల కాల పరిమితి దాటేసింది. అంటే ప్రజలు తీర్పిచ్చిన ఐదేళ్ల కాలవ్యవధిలో సగానికి పైగా దూరం ప్రయాణించింది. ఐదేళ్ల ప్రభుత్వ పూర్తి ప్రయాణంలో కీలక మజిలీకి చేరినట్టే. ఈ తరుణంలో సర్కారు నడుస్తున్న తీరు.. సాధించిన విజయాలు.. జరుగుతున్న పొరపాట్లను సమీక్షించుకోవడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ఏడాదిని మినహాయిస్తే.. పాలనా పరమైన మార్పులు చేసుకోవటానికి ఆర్నెళ్ళ సమయం కూడా లేదు. అలాగే తెలంగాణ సర్కారు పనితీరుని ప్రజలు ఎలా చూస్తున్నారనేది కూడా కీలకమైన అంశమే. అట్నుంచి కూడా బేరీజు వేసుకుంటే.. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో.. సర్కారుకు సరైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

తెలంగాణ సర్కారులో వన్ మేన్ ఆర్మీ కృషి మాత్రమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవిశ్రాంతంగా కష్టపడుతున్నారు. జనంలో తిరుగుతున్నారు. ఒకపక్క అభివృద్ధి పథకాలపై దృష్టి సారిస్తూనే మరోవైపు సంక్షేమంపై పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. దీనిని తెలంగాణలో ఎవ్వరూ కాదనలేరు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లున్నా, ప్రతిపక్షాలతో నిరంతరం యుద్ధం కొనసాగిస్తూనే పాలనా వ్యవహారాల్లో చురుగ్గానే ముందుకు వెళ్తున్నారు. నిజానికి రేవంత్ సీఎం అయినప్పుడు.. ఆయన పనితీరు ఎలా ఉంటుందోననే అనుమానాలు ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోనూ ఉండేవి. కానీ చాలావరకు అన్నిరకాలకు అనుమానాలకు తెరదించే విధంగా సీఎం రేవంత్ రాటుదేలారు. మొదట్లో కాస్త బాలారిష్టాలు ఎదుర్కున్నా.. రోజులు గడిచేకొద్దీ.. సీఎం తన పనితీరు విషయంలో బాగా మెరుగుపడ్డారు. ఇప్పుడైతే తన పని మీద పట్టు సాధించారనే చెప్పాలి. అంతటితో ఆగకుండా.. చివరకు ప్రభుత్వంపై వచ్చే రాజకీయ విమర్శల్ని కూడా సమర్థంగా తిప్పికొడుతున్నారు. కానీ ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏ ప్రభుత్వంలో అయినా సీఎం ఒక్కరు కష్టపడితే సరిపోదు. అలాగే ఆయన పనితీరు మాత్రమే బాగుంటే చాలదు. మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేయాలి. ప్రజలు ఈ మొత్తం పనితీరు చూసే మార్కులు వేస్తారు. యంత్రాంగం అన్నప్పుడు సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కూడా లెక్కలోకి వస్తారు.

ప్రస్తుతం తెలంగాణ సర్కారు పనితీరు చూస్తే.. సీఎం వేగంగా దూసుకెళ్తుంటే.. యంత్రాంగం ఆయన్ను వెనక్కిలాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్పీడుకి, పనితీరుకు తగినట‌్లుగా మిగిలిన మంత్రుల సహకారమే ఆయనకు అందడం లేదు. ఎక్కడో ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లోపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి పట్ల, పాలనావ్యవహారాల పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, వేగం, మిగిలిన మంత్రివర్గ సహచరుల్లో, కొందరు అధికారుల్లో లేకపోవడం బాధాకరం. ఇది ఏదో ఒక సందర్భంలో బయటపడుతోంది. మాకు స్వేచ్ఛ వద్దని కొందరు మంత్రులు భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో. అందరూ కూర్చుని ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో సీఎం చెప్పేవరకు ప్రజలకు ప్రభుత్వ ఉద్దేశాలు, ఆలోచనలపై స్పష్టత రావడం లేదు. కొందరు మంత్రులు చురుగ్గా ఉంటున్నా.. వారు సీఎం స్థాయిలో దూకుడు చూపించడం లేదు. మిగతా మంత్రులైతే తమకేం పట్టనట్టే ఉంటున్నారు. దీంతో సీఎంకి, మంత్రులకు మధ్య గ్యాప్ ఉందన్న విషయం బయటపడుతోంది.

ప్రభుత్వంలో ఈ సమన్వయ లోపం చూసి తెలంగాణలో ప్రతిపక్షం దూకుడు పెంచుతోంది. సీఎం చుట్టూ వున్న వ్యవస్థలు , అధికారులూ పనిచేయడం లేదు. చాలా విషయాలు టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడంతో అనుకున్న లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. సర్కారు వేరు, ఉద్యోగులు వేరు కాదన్న సీఎం భావనను అధికారులు తప్పుగా తీసుకున్నట్టుగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వంలో మంత్రులున్నా.. సీఎం అన్నా అధికారులకు భయభక్తులు తగ్గిపోయాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ పనైనా చెప్పగానే చేయక్కర్లేదు. ఏదో ఓ కారణం చెబితే సర్దుకుంటారు. పొరపాటైంది ఈసారి అలా జరగదంటే క్షమించేస్తారులే అనే తేలిక భావన యంత్రాంగంలో బలపడింది. ఇప్పటికైనా ఇలాంటి భావనకు మంగళం పాడకపోతే.. సర్కారు కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకపోవడం, అధికారుల పట్ల రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించకపోవడంతో, కొన్ని శాఖల్లో పాలన గాడితప్పింది. ఆయనొక్కడే రోజుకి 18 గంటలు పనిచేయడం వల్ల ఉపయోగం వుండదు. దాంతోపాటు అదేవేగం, అదే ఇంటిగ్రిటీ మంత్రులు, అధికారుల్లో కూడా వుండాలి. తెలంగాణ సర్కారుకు ఇప్పుడేదైనా సమస్య ఉందీ అంటే, ఇదే అతిపెద్ద సమస్య. ఎక్కడైనా వన్ మ్యాన్ షో కంటే టీమ్ వర్క్ ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది. ప్రభుత్వానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పైగా ప్రభుత్వమనేదే సమష్టి బాధ్యత. పేరుకి సీఎం పెద్ద దిక్కుగా కనిపించినా.. మంత్రులందరికీ ప్రభుత్వ నిర్వహణలో బాధ్యత ఉంటుంది. అంతిమంగా క్యాబినెట్‌కు సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ తెలంగాణ సర్కారు నడుస్తున్న తీరు చూస్తే.. క్యాబినెట్‌లో చాలా మందికి అసలు తాము మంత్రులమని గుర్తుందా.. లేదా అనే సందేహాలు వస్తున్నాయి. పట్టుమని పది మంది మంత్రులు కూడా సీఎంకు చేదోడువాదోడుగా ఉండటం లేదని కాంగ్రెస్‌ లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అటు రేవంత్ కూడా అందర్నీ కలుపుకుపోవాలని, అందర్నీ ప్రభుత్వ నిర్వహణలో భాగస్వాముల్ని చేయాలని ప్రయత్నిస్తున్నా.. ఒంటి చేతి చప్పట్ల కథే రిపీట్ అవుతోంది. ఇలాగైతే ఎలాగని, మంత్రులంతా బాధ్యత తీసుకుని ప్రజల్లోకి చురుగ్గా వెళ్లాలని ప్రతి క్యాబినెట్ మీటింగ్‌ లో సీఎం మొత్తుకుంటున్నా.. ప్రస్తుతానికైతే ఫలితం పెద్దగా కనిపించడం లేదు. క్యాబినెట్ పోస్ట్ వచ్చేదాకా లాబీయింగులు చేసి మంత్రులైన వారిలోనూ కొందరు సీట్లో కూర్చోగానే.. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మెజార్టీ మంత్రుల తీరు ఇలా ఉండబట్టే పంచాయతీ ఎన్నికల దగ్గర్నుంచీ ఉపఎన్నికల దాకా.. అన్నింటికీ ముఖ్యమంత్రే వ్యూహరచన చేసి.. అనుక్షణం సమీక్షించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అదే మంత్రులంతా చొరవ తీసుకుంటే.. ముఖ్యమంత్రికి పాలనపై మరింతగా ఫోకస్ చేసే అవకాశం, కొత్త విధానాలపై మేధోమథనం చేసే వెసులుబాటు దొరుకుతుందని సీనియర్లు కూడా వాపోతున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే తెలంగాణలో మెజార్టీ మంత్రులు.. ఏమున్నా సీఎం చూసుకుంటారులే.. మనం మమ అనిపిస్తే పనైపోతుంది అనుకుంటున్నారు. అలా కాదు.. మీకూ బాధ్యత ఉంది. మీ వంతు పని మీరు చేయాలని ఎవరైనా చెప్పినా.. లైట్ తీస్కుంటున్న వైనం కళ్ల ముందే ఉంది. అప్పటికీ సీఎం మాత్రమే కాకుండా కొందరు సీనియర్ మంత్రులు కూడా కల్పించుకుని క్యాబినెట్‌ సహచరుల బాధ్యతలేమిటో.. ఎలా చురుగ్గా ఉండాలో ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నా.. అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించే వారి సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా మంత్రులే ఇలా ఉన్నప్పుడు ఇక వారి కింద పనిచేసే అధికారుల్లో చిత్తశుద్ధిని ఆశించటం అత్యాశే అవుతుంది. అందుకే ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిన పెట్టాలంటే.. మొదట క్యాబినెట్ లో దూకుడు పెరగాలనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.