Zepto IPO: దేశంలో 10 నిమిషాల్లో సరుకులు ఇంటి వద్దకు అందించే క్విక్ కామర్స్ రంగంలో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) ఐపీఓ ప్రణాళికలు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటుండగా, ప్రత్యర్థి సంస్థలు స్విగ్గీ, జొమాటోలు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం.. జెప్టో నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు వైపు మళ్లుతోంది.
వాల్యుయేషన్‌పై పెట్టుబడిదారుల అభ్యంతరాలు
జెప్టో ఐపీఓ చుట్టూ నెలకొన్న ప్రధాన సమస్య కంపెనీ వాల్యుయేషన్‌గానే కనిపిస్తోంది. 2025 అక్టోబర్‌లో అమెరికాకు చెందిన CalPERS ఫండ్ నుంచి పెట్టుబడులు సమీకరించినప్పుడు కంపెనీ విలువ సుమారు 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు IPOకి రెడీ అవుతున్న సమయంలో దేశీయ మ్యూచువల్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారులు అంతటి విలువను అంగీకరించడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ప్రస్తుతం జెప్టో వాల్యుయేషన్ 2.5 నుంచి 3 బిలియన్ డాలర్ల మధ్యకు పడిపోయినట్లు మార్కెట్‌లో ప్రచారం జరుగుతోంది. కంపెనీ భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు చేస్తుండటం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోందట.
స్విగ్గీ, జొమాటోలు..
జెప్టో ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ప్రత్యర్థి సంస్థలకు లాభంగా మారింది. జూలై నెలలో స్విగ్గీ షేర్లు దాదాపు 24 శాతం వరకు పెరిగాయి. 2024 నవంబర్‌లో లిస్టింగ్ తర్వాత కంపెనీకి ఇదే అత్యుత్తమ నెలగా నిలిచింది. మరోవైపు జొమాటోలు షేర్లు కూడా 17 శాతం వరకు పెరిగాయి. జెప్టో బలహీనతను అవకాశంగా మార్చుకుని మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా ఈ సంస్థలు అడుగులు వేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో టాటా గ్రూప్‌కు చెందిన బిగ్ బాస్కెట్, అలాగే అమెజాన్ ఇండియా కూడా క్విక్ కామర్స్ మార్కెట్లో పోటీని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు జెప్టో తన ఐపీఓ ప్రణాళికను రద్దు చేయలేదు. ఈ క్రమంలో కంపెనీ దాఖలు చేసిన IPO డ్రాఫ్ట్ గడువు ఆగస్టు 21తో ముగియనుంది. దీంతో తక్కువ వాల్యుయేషన్‌ను అంగీకరించాలా, ఇష్యూ పరిమాణాన్ని తగ్గించాలా లేదా IPOని వాయిదా వేయాలా అనే అంశాలపై సంస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రే మార్కెట్‌లో జెప్టో షేర్ల విలువ 20 శాతానికి పైగా పడిపోవడం కూడా పెట్టుబడిదారుల్లో విశ్వాసం తగ్గుతున్న సంకేతంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నగదు కొరత కారణంగా జెప్టో తన ఖర్చులను తగ్గించాల్సి వస్తే కంపెనీ విస్తరణ వేగం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న స్విగ్గీకి ఎక్కువ ప్రయోజనం కలగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ Nomura కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. స్విగ్గీకి చెందిన ఇన్‌ష్టా మార్ట్ వ్యాపారం 2028 వరకు నష్టాల్లో ఉన్నా, ఫుడ్ డెలివరీ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలతో ఆ నష్టాలను భర్తీ చేసే సామర్థ్యం కంపెనీకి ఉందని పేర్కొంది.

