NTV Telugu Site icon

Instagram Down: ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. యూజర్లకు ఇక్కట్లు

Instagram

Instagram

Instagram Down: ప్రస్తుతం సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. దాదాపుగా అందరూ వీటిని వాడుతున్నారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ మీదే ఆధారపడుతోంది. ఇన్‌స్టా రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది అకౌంట్లు లాక్ అయిపోయినట్లు ఫిర్యాదులు పోటెత్తాయి. తమ యాప్ క్రాష్ అవుతోందని పలువురు యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 7వేల అకౌంట్లు సస్పెండ్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన ఇన్‌స్టాగ్రామ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. సస్పెండ్​ అయిన అకౌంట్​‌లను పునరుద్ధరించేందుకు ఈమెయిల్​, ఫోన్​ నెంబర్​ వంటి వివరాలను యూజర్ల నుంచి రాబడుతోంది.

Read Also: Karthika Masam : కార్తీకమాసంలో ఈ ఆహారాలను తినకూడదు

కాగా పలువురు యూజర్లకు ఎదురైన అంతరాయానికి ఇన్‌స్టాగ్రామ్ క్షమాపణలు తెలియజేసింది. అయితే ఆయా అకౌంట్లు ఎందుకు సస్పెండ్ అయ్యాయనే కారణాలను మాత్రం ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం వెల్లడించలేదు. ఇటీవల వాట్సాప్ సేవలు కూడా ఇలాగే నిలిచిపోగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వంతు వచ్చింది. ఈ రెండు ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలు కావడం గమనించాల్సిన విషయం. కొన్నిరోజుల క్రితం వాట్సాప్​ సేవలు నిలిచిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ విపరీతంగా పేలాయి. వాట్సాప్​‌కు గ్రహణం పట్టిందని నెటిజన్‌లు జోకులు కూడా వేసుకున్నారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్​ సేవలు నిలిచిపోవడం నెలన్నర రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గతంలో సెప్టెంబర్​ 23న కూడా ఇన్‌స్టాగ్రామ్ సేవలలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.