భారత వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రపంచ బ్యాంకు మరోమారు తగ్గించింది. 8.7 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచబ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధిరేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంటే జనవరి నాటి తొలి అంచనాలతో పోలిస్తే వృద్ధిరేటు అంచనాలను 1.2 శాతం మేర ప్రపంచ బ్యాంక్ తగ్గించినట్లయ్యింది. 2023-24లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 7.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2021-22లో జీడీపీ వృద్ధి 8.7 శాతంగా నమోదవ్వడం గమనార్హం.
కొవిడ్ పరిణామాల నుంచి కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అవరోధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవరోధాలు ఏర్పడొచ్చని ప్రపంచ బ్యాంక్ వివరించింది. 2022 ప్రథమార్ధంలో కొవిడ్ కేసుల విస్తృతి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరగడం ఇబ్బంది పెట్టింది. తక్కువ వేతనాలు లభించే ఉద్యోగాలే అధికంగా లభిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పుంజుకోవడం, వ్యాపార పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు-సంస్కరణలు వంటివి వృద్ధికి కొంత మేర ఉపకరిస్తాయని వివరించింది. మౌలిక వసతులపై ప్రభుత్వం అధికంగా దృష్టి పెట్టడం, పనిచేయని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం కలిసి వస్తుందని పేర్కొంది.
ప్రపంచ వృద్ధిరేటు కూడా ఈ సంవత్సరం 2.9 శాతానికి తగ్గే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2021లో నమోదైన 5.7 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రపంచ వృద్ధి 4.1 శాతంగా నమోదుకావచ్చని ఈ ఏడాది జనవరిలో ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం గమనార్హం.