Gold Silver Prices: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. శుక్రవారం భారీగా తగ్గాయి. శనివారం మాత్రం ధరల్లో పెద్దగా మారలేదు. దీంతో పెట్టుబడి దారుల్లో, సామాన్య ప్రజల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసిన బంగారం, వెండి ధరలపైనే చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన రీజన్స్ వాళ్లు చెబుతున్నారు. ఇంత భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎందుకు పడిపోయాయి? అనేది అందరిలో మొదలైన కామన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..
READ MORE: Shocking Discovery: నీళ్లు తాగకపోతే ఇంత ఘోరమా.? టీనేజర్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు.!
వాస్తవానికి.. శుక్రవారం బంగారం ధరలో పతనం గట్టిగానే కనిపించింది. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం ధర ఒక్కరోజులోనే రూ.14,000 తగ్గి 10 గ్రాములకు రూ.1,69,000కి చేరింది. ఇదే బంగారం అంతకు ముందు రోజు రూ.12,000 పెరిగి రూ.1,83,000 అనే ఆల్‌టైమ్ హైని తాకింది. వెండి పరిస్థితి కూడా ఇదే తరహా. కిలో వెండి ధర రూ.20,000 తగ్గి రూ.3,84,500కి పడిపోయింది. అంతకు ముందు సెషన్‌లో వెండి రూ.19,500 పెరిగి రూ.4,04,500 వరకు వెళ్లింది. అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు ఇంతగా పెరిగి, తర్వాత తగ్గాయన్నదే అసలు కథ. బంగారం ఎప్పటినుంచో “సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్”గా పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య యుద్ధాల భయం మళ్లీ మొదలవడం, వడ్డీ రేట్లు ఏ దిశగా వెళ్తాయో అర్థం కాకపోవడం, ప్రపంచ వ్యవస్థలో మార్పుల సంకేతాలు కనిపించడం ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను బంగారం వైపు లాగాయి. అస్తిరత ఉన్నప్పుడు డబ్బు సురక్షితంగా ఉంటుందన్న నమ్మకమే బంగారానికి బలంగా మారింది.
కానీ శుక్రవారం వచ్చిన పతనానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయొచ్చన్న వార్తలు మార్కెట్లలో చక్కర్లు కొట్టాయి. ఫెడరల్ రిజర్వ్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన సంస్థ. అక్కడ మార్పులు వస్తాయన్న సంకేతాలు కనిపించగానే మార్కెట్లు ఒక్కసారిగా స్పందించాయి. దాంతో బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఇది బంగారం మీద నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. పెద్ద సంస్థలే కాదు, చిన్న పెట్టుబడిదారులు కూడా ఈ ర్యాలీలో కీలక పాత్ర పోషించారు. ధరలు పెరుగుతున్న కొద్దీ, సాధారణ పెట్టుబడిదారులు కూడా బంగారం, వెండి లాంటి లోహాలను భద్రతగా భావించి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం సులభం కావడంతో పాల్గొనేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది.
READ MORE: Magha Purnima 2026: రేపు ఈ వస్తువులను దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.!
వెండి విషయంలో పరిస్థితి ఇంకాస్త భిన్నంగా ఉంది. గత నెల రోజుల్లోనే వెండి ధరలు 60 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అదే సమయంలో బంగారం పెరుగుదల దాదాపు 30 శాతం మాత్రమే. వెండికి రెండు రకాల డిమాండ్ ఉంటుంది. ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ భద్రత అయితే.. రెండోది పరిశ్రమల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో వెండి వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. కానీ సరఫరా అంత వేగంగా పెరగడం లేదు. గత ఐదేళ్లుగా వెండి మార్కెట్‌లో లోటే కొనసాగుతోంది. పైగా వెండి ఎక్కువగా ఇతర లోహాల తవ్వకాల్లో ఉప ఉత్పత్తిగా వస్తుంది కాబట్టి, ఉత్పత్తి పెంచడం అంత సులభం కాదు.
ఈ పరిస్థితుల్లో వెండిపై చిన్న పెట్టుబడిదారుల ఆసక్తి బాగా పెరిగింది. ధరలు పెరుగుతున్నాయంటే ఇప్పుడు కొనకపోతే అవకాశం చేజారిపోతుందన్న భావనతో చాలా మంది కొనుగోళ్లు చేశారు. కానీ ఇక్కడే ప్రమాదం ఉంది. వెండి చాలా అస్తిరమైన లోహం. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇటీవల పతనం వరకు వెండి ధరలు ఏకంగా 269 శాతం పెరిగాయి. వెండి ధరల ఊగిసలాట బంగారంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. అంటే వేగంగా పైకి వెళ్లిన ధరలు, అంతే వేగంగా కిందికి కూడా రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బంగారం, వెండిలా పెట్టుబడి పెడితే మధ్యలో ఎలాంటి ఆదాయం ఉండదు. షేర్లలా డివిడెండ్ లేదు.. బాండ్లలా వడ్డీ లేదు. ధరలు పెరిగితేనే లాభం, పడితే నష్టం. అందుకే ధరలు బాగా పెరిగిన తర్వాత తొందరపడి కొనడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. చాలా సార్లు చిన్న పెట్టుబడిదారులు గరిష్ట స్థాయికి దగ్గరగా కొనుగోలు చేస్తారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు, సెంట్రల్ బ్యాంకులు మాత్రం ఏళ్ల తరబడి తక్కువ ధరల్లోనే కొనుగోలు చేస్తూ వచ్చారు.
