దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అంతర్జాతీయ విపణిలో రసాయన ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఆ భారం సామాన్య రైతుపై పడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఫాస్ఫాటిక్ మరియు పొటాసిక్ (P&K) ఎరువుల కోసం సుమారు రూ. 41,543 కోట్ల భారీ రాయితీని మంజూరు చేసింది.
ఈ నిర్ణయం ద్వారా రైతులు సబ్సిడీ ధరలకే నాణ్యమైన ఎరువులను పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించి, దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఎరువుల లభ్యతలో ఎలాంటి కొరత లేకుండా చూడటమే కాకుండా.. విదేశీ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి అన్నదాతను కాపాడటానికి ఈ భారీ సబ్సిడీ రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైతు సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, జైపూర్ మెట్రో ప్రాజెక్టు రెండో దశకు రూ. 13 వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
Also Read:Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!
మరోవైపు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా రాజస్థాన్‌లో ప్రతిష్టాత్మకమైన భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వ్యయ సవరణలకు, ఈక్విటీ భాగస్వామ్య మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా ఎదిగిందని.. ఈ కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేశీయ సామర్థ్యం మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 258 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉంది. ఈ రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నాటికి వాణిజ్యపరంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు ధృవీకరించారు. ఇది ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా.. పెట్రోకెమికల్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఈ రిఫైనరీ ఒక మైలురాయిగా నిలవనుంది. సమగ్ర గ్రామీణ అభివృద్ధి , పారిశ్రామిక వృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనున్నాయి.