Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Sale Price History: పండుగలు వచ్చాయంటే ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడిపోతాయి వివిధ సంస్థలు.. ఇక, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రారంభిస్తాయి.. ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే, సేల్‌లో ప్రకటించే డిస్కౌంట్లు నిజంగా ఎంత వరకు ఉపయోగకరమైనవి? గతంలో ఆ ఉత్పత్తి ధర ఎంత ఉండేది? ఇప్పుడు లభిస్తున్న ఆఫర్‌తో నిజంగా ఎంత డబ్బు ఆదా అవుతుంది? అనే సందేహాలు వినియోగదారుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అమెజాన్ ఇండియాలో అందుబాటులోకి వస్తున్న ప్రైస్ హిస్టరీ (Price History) ఫీచర్ ఉపయోగపడుతుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల వరకు అనేక ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తున్నాయి. సేల్‌లో ముందస్తు యాక్సెస్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. అయితే, ఉత్పత్తిపై ఎంత శాతం డిస్కౌంట్ ప్రకటించారనే దానికంటే, గత ధరతో పోలిస్తే ప్రస్తుతం ఎంత తక్కువకు లభిస్తోందన్నది ముఖ్యం. అందుకే కొనుగోలు చేసే ముందు ధరల చరిత్రను పరిశీలించడం ద్వారా ఆఫర్ ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందో అంచనా వేయవచ్చు.
Also Read
- BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
- DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
అమెజాన్‌లో ప్రైస్ హిస్టరీ ఫీచర్.. ఎలా ఉపయోగించాలి?
అమెజాన్ ఇండియాలో కొన్ని ఉత్పత్తుల పేజీలపై ‘ప్రైస్ హిస్టరీ’ అనే ఆప్షన్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సంబంధిత ఉత్పత్తి గతంలో ఏ ధరకు విక్రయించబడిందో, ప్రస్తుతం ఎంత ధరకు అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. దీన్ని ఉపయోగించడానికి ముందుగా అమెజాన్ వెబ్సైట్ లేదా యాప్‌లో మీకు కావాల్సిన ఉత్పత్తిని తెరవాలి. ఆ తర్వాత ఉత్పత్తి వివరాల్లో ‘ప్రైస్ హిస్టరీ’ ఆప్షన్ కనిపిస్తే దానిపై క్లిక్ చేయాలి. అనంతరం గత ధరలు, ప్రస్తుత ధరల మార్పులను గ్రాఫ్ రూపంలో పరిశీలించవచ్చు.
నెల, మూడు నెలలు, ఏడాది ధరల వివరాలు
ప్రైస్ హిస్టరీ ఫీచర్లో ఒక నెల, మూడు నెలలు, ఒక సంవత్సరం వరకు ధరల మార్పులను గ్రాఫ్ రూపంలో చూడవచ్చని అందించిన సమాచారం చెబుతోంది. దీంతో సేల్కు ముందు ఉత్పత్తి ధర ఎలా ఉండేది, మధ్యలో ధర పెరిగిందా లేదా తగ్గిందా అనే విషయాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు, ఒక స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించినప్పుడు దాని ప్రస్తుత ధరను మాత్రమే కాకుండా, గత కొన్ని నెలల ధరలతో పోల్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రకటించిన తగ్గింపు నిజంగా ఎంత ప్రయోజనం ఇస్తుందో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్ల ధరలను కూడా పరిశీలించవచ్చు
ఈ ఫీచర్‌ను ఉపయోగించి ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వంటి స్మార్ట్ఫోన్ల ధరల చరిత్రను పరిశీలించినట్లు కథనంలో పేర్కొన్నారు. ఆయా ఫోన్ల ధరలు గ్రాఫ్ రూపంలో కనిపించడంతో నెలనెలా ధరల్లో వచ్చిన హెచ్చుతగ్గులను గమనించవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారితో పాటు టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవారికి కూడా ధరలను పోల్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ఫీచర్ అన్ని ఉత్పత్తులకు అందుబాటులో ఉండకపోవచ్చు..
ప్రస్తుతం కొందరికే అందుబాటులో.. త్వరలో మరింత మందికి!
అమెజాన్ ఇండియా ప్రైస్ హిస్టరీ ఫీచర్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఫీచర్ ద్వారా కొన్ని ఉత్పత్తుల గత, ప్రస్తుత ధరల మధ్య గణనీయమైన వ్యత్యాసాలను గుర్తించినట్లు కూడా కథనంలో వెల్లడించారు. అయితే, ధరల చరిత్రలో కనిపించే సమాచారం ఆధారంగా మాత్రమే కొనుగోలు నిర్ణయం తీసుకోకుండా, ఉత్పత్తి నాణ్యత, విక్రేత వివరాలు, వారంటీ, రిటర్న్ పాలసీ, ఇతర ఆఫర్లను కూడా పరిశీలించడం మంచిది.
సేల్‌లో కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు ప్రస్తుత ధరను ఇతర విక్రేతల ధరలతో పోల్చండి. ధరల చరిత్ర అందుబాటులో ఉంటే దాన్ని పరిశీలించండి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్లతో కలిపి తుది ధర ఎంత అవుతుందో లెక్కించండి. ఇలా చేయడం ద్వారా సేల్‌లో నిజంగా ఎంత ఆదా చేస్తున్నారో తెలుసుకోవచ్చు. మొత్తానికి, భారీ డిస్కౌంట్ కనిపించగానే వెంటనే కొనుగోలు చేయకుండా ధరల చరిత్రను పరిశీలించడం తెలివైన నిర్ణయం. అమెజాన్‌లో ప్రైస్ హిస్టరీ ఫీచర్ అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించి, మీకు సరైన ధరకు ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాన్ని మెరుగుపరుచుకోవచ్చు.. మీరు కూడా కొనుగోలు చేసే మందు.. ఆ వస్తువు ధరకు సంబంధించిన గత హిస్టరీ తెలుసుకునే వెసులుబాటు ఉందో లేదో చెక్ చేయండి..
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!