Today(21-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే నడిచింది. ఇవాళ బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. జపాన్, చైనా, అమెరికాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందేమో అనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి.
సెంటిమెంట్ దెబ్బతినటంతో రెండు సూచీలు కూడా కోలుకోకుండా లాసుల్లోనే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 635 పాయింట్లు కోల్పోయి 61 వేల 67 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 193 పాయింట్లు తగ్గి 18 వేల 192 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 7 కంపెనీల స్టాక్స్ వ్యాల్యూ హైలెవల్లోనే ఎండ్ అయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా తగ్గిపోయి 60 వేల 938 పాయింట్లకు పడిపోయింది.
read also: COVID-19: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
తర్వాత పాక్షికంగా కోలుకొని 61 వేల 200 పాయింట్ల వరకు వచ్చింది. నిఫ్టీ 18 వేల 200 పాయింట్ల వద్ద టెస్టింగ్ ఎదుర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ హండ్రెడ్, స్మాల్‌క్యాప్ హండ్రెడ్ దాదాపు ఒక శాతం డౌన్ అయ్యాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ అత్యధికంగా లాభపడింది. 2 శాతానికిపైగా ట్రేడ్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 6 శాతం, అదానీ పోర్ట్స్ 3 శాతం లాసయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు భారీగా నష్టపోయాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జేకే పేపర్ కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా ర్యాలీ తీసి ఒక్కో షేరు ధర రికార్డు స్థాయిలో 452 రూపాయల 40 పైసలు పలికింది. 10 గ్రాముల బంగారం రేటు 102 రూపాయలు పెరిగి 55 వేల రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 97 రూపాయలు పడిపోయి 69 వేల 545 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 3 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 64 పైసల వద్ద ఉంది.