TCS Number One: ఐటీ సర్వీసుల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఇండియాలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ వ్యాల్యూ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి 45 పాయింట్ 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు కాంతర్ బ్రాన్జ్ ఇండియా ర్యాంకింగ్ సంస్థ ఒక జాబితాను రూపొందించింది. ఈ లిస్టులో టీసీఎస్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును మరియు ఇన్ఫోసిస్‌ను దాటి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. బ్రాండ్ వ్యాల్యూ 212 శాతం పెరగటంతో ఈ ఘనత సాధించింది. ఈ లిస్టులో ఎక్కువ కాలంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే టాపర్‌గా నిలుస్తోంది. ఈ ర్యాంకులను 2014లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ సంస్థే నంబర్ వన్‌గా కొనసాగి ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం అయింది.
1.62 % పెరిగిన ఎగుమతులు
గతేడాది ఆగస్టు కన్నా ఈసారి మన దేశ ఎగుమతులు 1 పాయింట్ ఆరు రెండు శాతం పెరిగాయి. ఈ షిప్‌మెంట్ల విలువ 33 పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచ దేశాల్లో ఇన్‌ఫ్లేషన్ పెరగటం, సప్లై చెయిన్‌లో అంతరాయాలు నెలకొనటంతో 33 బిలియన్ డాలర్ల విలువైన ఎక్స్‌పోర్టులు మాత్రమే జరుగుతాయని ప్రాథమికంగా అంచనా వేయగా అంతకుమించి జరగటం విశేషం. అయితే.. ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్, జ్యూలరీ మరియు టెక్స్‌టైల్స్ వంటి కీలక వస్తువులకు విదేశాల్లో డిమాండ్ తగ్గింది.
‘ఐడీబీఐ’ కోసం త్వరలో బిడ్లు
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఈ బ్యాంక్‌లో ప్రభుత్వానికి ప్రస్తుతం 45 పాయింట్ నాలుగు ఎనిమిది శాతం వాటా ఉంది. ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ఎల్‌ఐసీ 49 పాయింట్ రెండు నాలుగు శాతం స్టేక్‌ను కలిగి ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌లోని పెట్టుబడుల ఉపసంహరణకు మరియు మేనేజ్మెంట్ బదిలీకి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2021 మే నెలలోనే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.