Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. జూలై నెల ప్రారంభం నుంచి మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 27 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2.82 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభాలను కూడా కలిపితే.. గడిచిన రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్లకు పైగా రికవరీ లభించడం విశేషం.
లాభాల వెనుక 4 ముఖ్య కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు భారత మార్కెట్లకు ఊతాన్నిచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా నాలుగు కారణాలు మార్కెట్ ర్యాలీకి కారణమయ్యాయని వెల్లడించారు.
* అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% తగ్గి, బ్యారెల్‌కు 70.79 డాలర్ల వద్దకు పడిపోయింది. అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో సానుకూల పురోగతి ఉండటంతో ఆయిల్ ధరలు దిగొచ్చాయి.
* జూన్ నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 25% పెరిగి దాదాపు 4 లక్షల యూనిట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు అద్దం పట్టింది.
* విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల ఒత్తిడి తగ్గడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది.
* దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఏఐ (AI) ఆధారిత ట్రేడింగ్ బలహీనపడటం, భారతదేశం లాంటి నాన్-AI మార్కెట్లకు అనుకూలంగా మారింది.
లాభాల్లో ఐటీ షేర్లు..
గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 30 షేర్ల బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 526.61 పాయింట్లు పెరిగి 77,449.25 వద్దకు చేరింది. అటు 50 షేర్ల ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ కూడా 153.6 పాయింట్ల లాభంతో 24,159.45 వద్ద ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వంటి బ్లూ-చిప్ ఐటీ షేర్లు భారీ లాభాల్లో పయనించగా.. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 4%, జపాన్ నిక్కీ 1% నష్టాల్లో ముగిసినప్పటికీ.. భారత మార్కెట్లు మాత్రం అంతర్గత సానుకూలతలతో రికార్డు లాభాల వైపు దూసుకుపోతున్నాయి.

