దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. జులై నెలకు మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికి.. రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపించాయి. రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి.చమురు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో ఈ సంస్థలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి 52,907కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.03 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలు మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఐటీసీ (3.97%), బజాన్ ఫైనాన్స్ (3.96%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.57%), సిప్లా(3.50%), బ్రిటానియా (3.40%), ఏసియన్ పెయింట్స్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.34%).
టాప్ లూజర్స్
ఓఎన్‌జీసీ(-13.53%), రిలయన్స్ (-7.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.53%), బజాజ్ ఆటో(-2.21%), ఎన్టీపీసీ (-1.82%), భారతి ఎయిర్ టెల్ (-1.54%), మారుతి (-0.87%).
