IPL: క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా స్పోర్ట్స్ లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ధనిక లీగుల్లో ఒకటిగా మారింది. దీనిపై సౌదీ అరేబియా రాజు కన్ను పడింది. ఐపీఎల్‌లో మల్టీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు ఐపీఎల్‌ని 30 బిలియన్ డాలర్ల విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చడం గురించి భారత ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు నివేదిక తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఇండియాను సందర్శించిన సౌదీ యువరాజు దీనిపై చర్చలు జరిగాయి. లీగ్ లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని, ఇతర దేశాలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు నివేదిక పేర్కొంది.
Read Also: Wagner Group: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో.. హిజ్బుల్లాకు రష్యా కిరాయి సైన్యం ఆయుధాలు..
వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం, బీసీసీఐ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఒప్పుకుంటే సౌదీకి చెందిన సావరిన్ వెల్త్‌ఫండ్ డీల్‌ని ముందుకు తీసుకెళ్లవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌కి సౌదీ పెట్రోలియం కంపెనీ సౌదీ ఆరామ్ కో, సౌదీ టూరిజం అథారిటీ అతిపెద్ద స్పాన్సర్లుగా ఉన్నాయి. గతేడాది టోర్నీ ప్రసార హక్కుల కోసం జరిగిన వేలం పాటలో 6.2 బిలియన్లు పలకడం ఈ టోర్నీకి ఉన్న క్రేజ్ ని తెలియజేస్తోంది. ఐపీఎల్ ఒక్క మ్యాచ్ కి 15.1 మిలియన్ డాలర్లు వస్తున్నాయి ఇది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, యూఎస్ నేషనల్ ఫుట్ బాల్ లీగ్ కన్నా ఎక్కువ.
అయితే ఐపీఎల్‌ని నిర్వహిస్తున్న బీసీసీఐ దీనిపై స్పందించలేదు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ అనతి కాలంలోనే క్రికెట్ లో అత్యంత విలువైన లీగ్‌గా ఎదిగింది. అనేక మంది క్రికెటర్లతో పాటు కోచ్‌లకు కెరీర్లను ఇచ్చింది. వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు సొంతదేశానికి ప్రాతినిథ్యం వహించడానికన్నా ఐపీఎల్‌లో ఆడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆలోచిస్తున్నారంటే అతిశయోక్తికాదు.