Site icon NTV Telugu

Jio: ఆ విషయంలో జియోనే తోపు..

Jio

Jio

టెలికం రంగం.. రిలయన్స్‌ జియో ఎంట్రీకి ముందు.. జియో ఎంట్రీ తర్వాత అని చెబుతుంటారు.. అంటే జియో టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో తొలి అడుగులు వేసినా.. ఆ తర్వాత చార్జీలు వడ్డించినా.. ఆ సంస్థ అందిస్తోన్న సేవలతో.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయిస్తే.. క్రమంగా యూజర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటింది. డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ నివేదికను విడుదల చేసింది. ట్రాయ్‌ డేటా ప్రకారం, సెప్టెంబర్‌లో జియో 4జీ యొక్క సగటు డౌన్‌లోడ్ వేగం 19.1 ఎంబీపీఎస్‌ కాగా, అక్టోబర్‌లో అది 20.3 ఎంబీపీఎస్‌కి పెరిగింది.

Read Also: Bank strike : డబ్బు కావాలంటే త్వరపడండి.. ఆ రోజు బ్యాంకులు పనిచేయవు

ఇదే సమయంలో మిగతా టెలికం సంస్థల విషయానికి వస్తే.. భారతీ ఎయిర్‌టెల్ యొక్క 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 15 ఎంబీపీఎస్‌ కాగా, వొడాఫోన్‌ ఐడియా యొక్క 4జీ డౌన్‌లోడ్ వేగం 14.5 ఎంబీపీఎస్‌గా ఉంది.. అంటే.. ఈ రెండింటితో పోలిస్తే, జియో యొక్క సగటు డౌన్‌లోడ్ వేగం 5 ఎంబీపీఎస్‌ ఎక్కువగా ఉంది. మరోవైపు, అప్‌లోడ్ వేగంలోనూ రిలయన్స్‌ జియోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో సెప్టెంబర్‌లో తొలిసారి టాప్ పొజిషన్‌కు చేరుకున్న జియో.. అక్టోబర్‌లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జియో సగటు 4జీ అప్‌లోడ్ వేగం 6.2 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. ఇక, వోడాఫోన్ ఐడియా 4.5 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్ వేగంతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో ఎయిర్‌టెల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్‌ 4జీ అప్‌లోడ్ వేగం 2.7 ఎంబీపీఎస్‌కే పరిమితం అయ్యింది.. అంటే జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం సగం కంటే తక్కువగా ఉంది.. ఇలా, అటు డౌన్‌లోడ్… ఇటు అప్‌లోడ్‌లోనూ మరోసారి తానే తోపు అని నిరూపించుకుంది రిలయన్స్‌ జియో.

Exit mobile version