Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సంచలన ప్రకటన చేసేశారు. జియో ప్లాట్‌ఫార్మ్స్ (Jio Platforms) ఐపీఓ (IPO)కి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ‘డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్’ (DRHP)ను ఈ రోజే (శుక్రవారం) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI)కి సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కీలక అడుగుతో దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఓ రియాలిటీగా మారబోతోంది.
భారత మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ..
జియో ప్రతిపాదిత ఐపీఓ దేశంలోనే ఇప్పటివరకు రానటువంటి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవబోతోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ (NSE) ప్రతిపాదిత రూ.30,000 కోట్ల ఐపీఓ, హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందిన రూ.27,870 కోట్ల ఐపీఓ రికార్డులను కూడా జియో అధిగమించనుందని టాక్. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10 ఫేస్ వాల్యూ కలిగిన సుమారు 27 కోట్ల కొత్త షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తొలత ఆఫర్ ఫర్ సేల్ (OFS) మోడల్‌ను పరిశీలించినప్పటికీ, రిలయన్స్ చివరికి ‘ఫ్రెష్ ఇష్యూ’ వైపే మొగ్గు చూపింది. దీనివల్ల ఐపీఓ ద్వారా వచ్చే నిధులు నేరుగా జియో ఖాతాకే వెళ్తాయి. ఆ నిధులను వ్యాపార విస్తరణ, సరికొత్త టెక్నాలజీ, డిజిటల్ సేవల కోసం వినియోగిస్తారు. “ప్రపంచ స్థాయి సాంకేతిక కంపెనీలను నిర్మించడంలో భారత్ ఎంత సమర్థవంతమైనదో జియో లిస్టింగ్ ప్రపంచానికి చాటిచెబుతుంది” అని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు.
లాభాల బాటలో జియో..
ఐపీఓ వస్తున్న తరుణంలో జియో ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ ప్రదర్శన ఎలా ఉందంటే.. కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ 13% పెరిగి రూ. 44,928 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నెట్ ప్రాఫిట్ (నికర లాభం) 13% వృద్ధితో రూ.7,935 కోట్లుగా నమోదైంది. ARPU (సగటు ఆదాయం).. ప్లాన్ల ధరల పెంపుతో రూ.214కు పెరిగింది. ప్రతి కస్టమర్ నెలకు సగటున 42.3 GB డేటాను వాడుతున్నారు. ప్రస్తుతం జియోకు దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్, క్లౌడ్ సేవలను జియో వేగంగా విస్తరిస్తోంది. 2020లోనే గూగుల్, మెటా, కెకెఆర్, సిల్వర్ లేక్, సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ వంటి ప్రపంచ దిగ్గజాలు జియోలో భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు సెబీ ఇచ్చే అనుమతి, ఐపీఓ లాంచ్ టైమ్‌లైన్‌పైనే ఉన్నాయి.

