రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, శాలరీ ఇలా రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే ఖాతా తెరిచే సమయంలో చాలా మంది నామినీని చేర్చకుండా వదిలేస్తుంటారు. దీని వల్ల ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై కీలక ప్రకటన చేసింది.
యాక్టివ్ లో ఉన్న అన్ని రకాల ఖాతాలకు, లాకర్లకు ఇకపై తప్పనిసరిగా నామినీలను చేర్చాలని బ్యాంకులను ఆదేశించింది. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారికి, కొత్తగా ఖాతా ఓపెన్ చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. బ్యాంకులు ఖాతాలకు కచ్చితంగా నామినీలను జోడించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. లెక్కకు మించి బ్యాంకు ఖాతాలకు నామినీలు లేరని దీని వల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేరని ఆర్బీఐ గుర్తించింది.
ఖాతాలకు నామినీ ఉండాల్సిందేనని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. నామినీలు లేకపోవడం కారణంగా ఖాతాదారులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఖాతాలోని డబ్బును పొందలేకపోతున్నారు. నామినీ లేకపోవడం కారణంగా కుటుంబ సభ్యులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఖాతాలకు నామినీలను తప్పనిసరి చేసింది. మరి మీ బ్యాంక్ ఖాతాకు నామినీ లేకపోతే వెంటనే నామినీని జోడించండి.