లాంగ్ డ్రైవ్ చేస్తూ మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? హైవేల్లో కనిపించే హోటళ్లలో గదులు అద్దెకు తీసుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే సమయంలో కారులోనే పడుకుందామంటే కాళ్లు చాపుకోలేం, సరిగా నిద్ర కూడా పడదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ. 99 చెల్లిస్తే సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది.
లాంగ్ డ్రైవ్ అయినా, ఫ్యామిలీ ట్రిప్ అయినా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడం చాలా అవసరం. కానీ ఎక్కువసార్లు సరైన విశ్రాంతి లేకుండా ప్రయాణం కొనసాగించడం వల్ల శరీర అలసట పెరుగుతుంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేస్తున్నవాళ్లకు మధ్యలో పవర్ న్యాప్ తీసుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. హైవే హోటళ్లలో రూమ్స్ తీసుకోవాలంటే అధిక ఖర్చు, కారులోనే నిద్రపోతే అసౌకర్యం. ఒకే సీట్లో ఇరుక్కుని పడుకోవడం వల్ల బాడీ పెయిన్స్, కాళ్ల నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
లాంగ్ డ్రైవ్ చేసే వారికి నిద్రలేమి వల్ల వచ్చే కునుకు చాలా ప్రమాదకరం. నిద్ర సమస్యల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు డ్రైవ్ చేస్తున్నప్పుడు అరగంట అయినా విరామం తీసుకోవాలని, అవసరమైతే 30 నిమిషాల పవర్ న్యాప్ తీసుకుంటే ప్రమాదాలను దాదాపు 99 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణుల అభిప్రాయం.
ఈ సమస్యకు పరిష్కారంగా PowerNap.com అనే కంపెనీ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. హైవేల్లో చిన్న చిన్న కంటైనర్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్లలో ఏసీ, సౌకర్యవంతమైన బెడ్స్, కప్పుకోవడానికి దుప్పట్లు వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. getpowernap.com అనే వెబ్‌సైట్‌లో మీరు ప్రయాణిస్తున్న హైవే వివరాలు ఎంటర్ చేస్తే, దగ్గరలో ఉన్న పవర్ న్యాప్ కంటైనర్ వివరాలు చూపిస్తాయి.
గంటసేపు ఈ కంటైనర్‌లో విశ్రాంతి తీసుకోవాలంటే కేవలం రూ. 99 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక పాస్ కోడ్ వస్తుంది. ఆ కోడ్‌ను కంటైనర్ డోర్ వద్ద ఉన్న లాకింగ్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. గంటపాటు ప్రశాంతంగా నిద్రపోయి, అలసటను దూరం చేసి, మళ్లీ ఫ్రెష్‌గా ప్రయాణం కొనసాగించవచ్చు. లాంగ్ డ్రైవ్ చేస్తున్నవాళ్లకు ఇది నిజంగా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.