Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…

Gas Cylindersss

Gas Cylindersss

కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం “ప్రధాని మంత్రి ఉజ్వల యోజన” (PMUY) లబ్ధిదారులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ప్రభుత్వం తన రాయితీ భారానికి కత్తెర వేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఏడాదికి అందుతున్న 9 సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏకంగా 4 కి తగ్గించేసింది. అంటే.. ఐదో సిలిండర్ కొనాలంటే ఇకపై సామాన్యుడు మార్కెట్ రేటు చెల్లించాల్సిందే.

ట్విస్ట్ ఏమిటంటే.. ఉజ్వల యోజన లబ్ధిదారులు సాధారణంగా ఏడాదికి నాలుగైదు సిలిండర్లు మాత్రమే వాడుతుంటారని, కాబట్టి ఈ తగ్గింపు వారిపై పెద్దగా ప్రభావం చూపదని ప్రభుత్వ అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం వల్లే పేద కుటుంబాలు సిలిండర్లను రీఫిల్ చేసుకోలేక, మళ్లీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వం ఏటా వాడకం సగటు 4-5 మాత్రమే ఉందని లెక్కలు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ధరల భయంతోనే వాడకం తగ్గిందనేది పచ్చి నిజం.

×
×
Ad

ప్రస్తుతం ఢిల్లీలో ఉజ్వల వినియోగదారులు రూ.642 చెల్లిస్తుండగా, సాధారణ వినియోగదారులు రూ.942 చెల్లిస్తున్నారు. అయితే… అంతర్జాతీయంగా ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్’ ఫిబ్రవరి నుండి 46 శాతం పెరగడంతో, ఒక సిలిండర్ సరఫరా ఖర్చు ప్రభుత్వానికి రూ.1600 దాటుతోంది. దీనివల్ల చమురు సంస్థలు ప్రతి సిలిండర్‌పై రూ.700 నష్టపోతున్నాయి. ఈ నష్టాలను తట్టుకోవడానికే లబ్ధిదారులకు ఏడాదికి కేవలం మొదటి 4 సిలిండర్లపై మాత్రమే రూ.300 చొప్పున (మొత్తం రూ.1200) రాయితీ ఇవ్వాలని చమురు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మొత్తానికి, అంతర్జాతీయ చమురు సెగలు.. దేశంలోని పేదవాడి వంటగదిని చల్లబరుస్తున్నాయి. రాయితీలు తగ్గించి బడ్జెట్ బ్యాలెన్స్ చేస్తున్నామంటున్న ప్రభుత్వం, పేదవాడి బడ్జెట్ తలకిందులవుతోందన్న నిజాన్ని విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.