దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం కేంద్రంపైనా పడుతోంది. 2020-21లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 85 డాలర్లకు చేరడంతో … దేశం క్రూడాయిల్ దిగుమతి బిల్ ఏకంగా మూడు రెట్ల పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ .. 30 ప్రపంచ ఆయిల్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వర్చువల్ పద్ధతిలో భేటీ అయ్యారు. దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కోరారు. ఏడేళ్లుగా ఇంధన రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఆయిల్ వేట, లైసెన్స్ పాలసీలు, గ్యాస్ మార్కెటింగ్, కోల్ బెడ్ మీథేన్, కోల్ గ్యాసిఫికేషన్ తదితర అంశాల పైనా చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా ఇంధనరంగంలో స్వయం సమృద్ధి సాధించే వరకూ ఈ సంస్కరణలు కొనసాగుతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయిల్ సెక్టార్ పై చర్చ సందర్భంగా.. లాభాలు ఆర్జించడం పైనుంచి అధిక ఉత్పత్తిని సాదించడంపై ఫోకస్ పెట్టాలని ప్రధాని.. సీఈవోలకు సూచించారు. దీనితో పాటు క్రూడాయిల్ స్టోరేజ్ వసతులపైనా చర్చించారు. దేశంలో అనూహ్యంగా పెరిగిన నేచురల్ గ్యాస్ డిమాండ్‌ను చర్చించారు. ఈ సమావేశానికి దేశీయ ఇంధన దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.