ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, ఈకామర్స్ సంస్థల్లో చేరి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అన్ని వేళల్లో కస్టమర్లకు సేవలందిస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఫుడ్, గ్రాసరీ, ఇతర వస్తువులను కస్టమర్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఆయా సంస్థల్లో వర్క్ చేసే ఆన్ లైన్ డెలివరీ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.
పని చేస్తేనే ఆదాయం, ప్రమాద బారిన పడినా కూడా సంస్థలు పట్టించుకోని వైనం. దీంతో గిగ్ వర్కర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్ కి తీపి కబురును అందించింది. వారికి అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నేడు(శనివారం) ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గిగ్ వర్కర్స్ కోసం ఆరోగ్యబీమా కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం కలుగనున్నది.
గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇ-శ్రమ్ పోర్టల్ కింద వారికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని అన్నారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్స్ కు భారీ ప్రయోజనం చేకూరునున్నది.