Mukesh Ambani: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తోంది. నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌లో సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,000–40,000 కోట్లు) విలువైన మెగా ఐపీఓను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సెబీ నుంచి డ్రాఫ్ట్ పేపర్లకు అనుమతి లభించడంతో జియో ప్లాట్‌ఫామ్స్ తుది తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారీ స్థాయిలో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ పూర్తయితే ఇప్పటి వరకు భారత్‌లో లిస్ట్ అయిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
నవరాత్రి.. లేదంటే దీపావళి
ఇక జియో ఐపీఓను అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ తొలి వారంలో తీసుకురావచ్చని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నవరాత్రి పండుగ రోజుల్లోనే ఐపీఓను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఆ సమయంలో సాధ్యం కాకపోతే దీపావళి పండుగను టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్ ముందుగా అంతర్జాతీయ రోడ్‌షోలు, ఆ తర్వాత దేశీయ రోడ్‌షోలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దాదాపు మూడు వారాల పాటు విదేశాల్లో, రెండు వారాల పాటు దేశీయంగా రోడ్‌షోలు నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
రూ.37,800 కోట్ల వరకు సమీకరణ
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ద్వారా సుమారు రూ.37,800 కోట్లు సమీకరించే అవకాశం ఉందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇది భారత ప్రైమరీ మార్కెట్‌లో సరికొత్త రికార్డుగా నిలవనుందని చెబుతున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో తీసుకొచ్చిన సుమారు రూ.27,000 కోట్ల ఐపీఓ దేశంలో పూర్తయిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. అంతకంటే పెద్దగా జియో ఐపీఓ ఉండే అవకాశం కనిపిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓ విలువ కంటే కూడా జియో ఇష్యూ పెద్దదిగా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ 270 మిలియన్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని ప్రతిపాదించింది. ఇవి ఐపీఓ అనంతరం కంపెనీ ఈక్విటీ క్యాపిటల్‌లో సుమారు 2.9 శాతం వాటాను సూచిస్తాయి. ఈ ప్రతిపాదిత ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండదని సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇదే కావడం మరో ప్రత్యేకత. గతంలో 2006లో రిలయన్స్ పెట్రోలియం లిస్టింగ్ జరిగింది.
ఐపీఓ డబ్బుతో ఏం చేస్తారంటే..
జియో ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని దాని ఆపరేటింగ్ సబ్సిడియరీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (RJIL) రుణాన్ని ముందుగానే తీర్చేందుకు వినియోగించనున్నట్లు DRHPలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రూ.27,500 కోట్ల వరకు రుణాన్ని చెల్లించే అవకాశం ఉంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి RJILకు ఈక్విటీ షేర్లు, ప్రిఫరెన్స్ షేర్లు, డిబెంచర్లు లేదా రుణాల రూపంలో నిధులు సమకూర్చే అవకాశం ఉందని DRHP వివరాలు వెల్లడిస్తున్నాయి.
జియోలో భారీ ఇన్వెస్టర్ల వాటాలు ఇవే..
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. పెద్ద ఇన్వెస్టర్ల వద్ద కలిపి సుమారు 30.9 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. మెటా ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన జాదూ హోల్డింగ్స్ వద్ద సుమారు 9.98 శాతం, గూగుల్ ఇంటర్నేషనల్ వద్ద 7.73 శాతం వాటా ఉన్నట్లు DRHPలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, KKR అనుబంధ సంస్థలు, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన సంస్థలు కూడా జియోలో పెట్టుబడిదారులుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత ఐపీఓ భారత స్టాక్ మార్కెట్‌లోనే కాకుండా దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లలోనూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవరాత్రి నుంచి దీపావళి మధ్య తుది తేదీ ఖరారైతే.. ఈ పండుగ సీజన్‌లో ఇన్వెస్టర్లకు ఇది నిజంగానే మెగా దీపావళి గిఫ్ట్‌గా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

