కుటుంబ అవసరాల కోసం కొత్త కారు కొనాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల వెంటనే కారు కొనలేని పరిస్థితి చాలామందికి ఎదురవుతుంది. ఎందుకంటే ఒక కారు కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి కొందరు వ్యక్తుల నుంచి అప్పు తీసుకుంటే, మరికొందరు బ్యాంకుల నుంచి కారు లోన్ తీసుకుని తమ కలను సాకారం చేసుకుంటారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు కారు లోన్లను అందిస్తున్నాయి. కారు లోన్‌పై వడ్డీ రేటు ప్రధానంగా దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, తక్కువ వడ్డీ రేటుతో కారు లోన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు గరిష్టంగా 7 సంవత్సరాల వరకు ఈఎంఐల రూపంలో లోన్‌ను తిరిగి చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో కారు లోన్లపై వడ్డీ రేట్లు సుమారు 7 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో కారు లోన్ వడ్డీ రేట్లు 8.85 శాతం నుంచి ప్రారంభమవుతుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌లో 9.15 శాతం నుంచి వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.80 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.85 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.60 శాతం, యాక్సిస్ బ్యాంక్ 8.90 శాతం, ఐడీఎఫ్సీ బ్యాంక్ 9.99 శాతం నుంచి కారు లోన్లపై వడ్డీ వసూలు చేస్తున్నాయి.ఫెడరల్ బ్యాంక్ 10 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 9 శాతం, కర్ణాటక బ్యాంక్ 8 శాతం, ఐడీబీఐ బ్యాంక్ 7.95 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.80 శాతం, కెనరా బ్యాంక్ 7.70 శాతం నుంచి కారు లోన్లపై వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి.
వీటిలో కొన్ని బ్యాంకులు తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు, ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. అందువల్ల కారు లోన్ తీసుకునే ముందు తప్పనిసరిగా మీ సిబిల్ స్కోర్‌ను ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఈఎంఐ కాలవ్యవధి, ఇతర నిబంధనలను పోల్చి చూసిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.