Site icon NTV Telugu

Today Business Headlines 16-12-22: హైదరాబాద్ నుంచి.. ఐరోపా వరకు.. ముఖ్యమైన బిజినెస్‌ న్యూస్‌

Today Business Headlines 16 12 22

Today Business Headlines 16 12 22

Today Business Headlines 16-12-22

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సర్వీసులు

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్‌ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్‌ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్‌ కార్డ్‌ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్‌తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. అదనపు ఛార్జీలను కూడా చెల్లించాల్సిన పని లేకుండానే వేగవంతమైన డేటా, మాటల్లో క్లారిటీని ఎంజాయ్‌ చేయొచ్చు. డేటా స్పీడ్‌ గతంలో కన్నా ఇప్పుడు 20-30 రెట్లు ఎక్కువగా వస్తుందని ఎయిర్‌టెల్‌ తెలుగు రాష్ట్రాల సీఈఓ శివన్‌ భార్గవ చెప్పారు.

‘నాగార్జునా’ కోసం ఒక్క సంస్థే ముందుకు

నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ను సొంతం చేసుకోవటానికి చాలా కంపెనీలు ముందుకు వస్తాయని భావించినప్పటికీ అలా జరగలేదు. అక్రె ఏఆర్‌సీ అనే ఒక్క సంస్థే బిడ్‌ దాఖలు చేసింది. అది కూడా 811 కోట్ల రూపాయలకు మాత్రమే బిడ్‌ వేసింది. నాగార్జునా సంస్థ ఏడు బ్యాంకుల నుంచి 15 వందల 82 కోట్ల రూపాయల లోన్‌ తీసుకోగా ఆ రుణాన్ని లీడ్‌ బ్యాంక్‌ ఐడీబీఐ అమ్మకానికి పెట్టింది. కొనుగోలు చేయదలచిన సంస్థలు ఈ నెల 14వ తేదీ లోపు బిడ్లు సమర్పించాలని గడువు విధించారు. దీనిపై సుమారు 13 సంస్థలు ఆసక్తి కనబరిచినప్పటికీ అవేవీ బిడ్లు దాఖలు చేయకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ ఇక యూనికార్న్‌

ప్రభుత్వాలకు మరియు రాయబార కార్యాలయాలకు పౌర సేవలతోపాటు టెక్నాలజీ బేస్డ్‌ సర్వీసులను అందించే బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ తాజాగా యూనికార్న్‌ హోదాను సొంతం చేసుకుంది. ఈ వారంలోనే వంద కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా ఎదిగి ఈ ఫీట్‌ సాధించింది. సంస్థ షేర్‌ వ్యాల్యూ గడచిన ఆరు నెలల్లో రెట్టింపునకు పైగా పెరిగినట్లు తెలిపింది. సాంకేతికత ఆధారంగా సేవలు అందించే.. ప్రపంచంలోని మూడు జెయింట్‌ సంస్థల్లో తామూ ఉన్నామని బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది.

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను తగ్గించిన ప్రభుత్వం

దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌ మరియు డీజిల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధీనంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రస్తుతం టన్నుకు 49 వందల రూపాయలు పన్ను విధిస్తుండగా దాన్ని 17 వందల రూపాయలకు తగ్గించింది. లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై ఇప్పుడు అమలు చేస్తున్న రేటు.. 8 రూపాయలను 5 రూపాయలకు తగ్గించింది. లీటర్‌ విమాన ఇంధనంపై వసూలు చేస్తున్న 5 రూపాయలను రూపాయినరకు కుదించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వివరించింది.

ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి రిలయెన్స్‌ ఎంట్రీ

రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇండిపెండెన్స్‌ అనే పేరుతో ప్రొడక్టులను లాంఛ్‌ చేసింది. ఈ ఉత్పత్తులను మొదట గుజరాత్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. రిలయెన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉండే రిలయెన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ద్వారా వీటిని విడుదల చేసింది. వంట నూనెలు, పప్పులు, ధాన్యాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ప్రొడక్టులు తదితర నిత్యవసర సరుకులను ఈ బ్రాండ్‌ నేమ్‌తో విక్రయించనున్నట్లు ప్రకటించింది. తద్వారా.. ఈ రంగంలోని దిగ్గజ సంస్థలైన హెచ్‌యూఎల్‌ మరియు ఐటీసీలతో డైరెక్టుగా పోటీపడనుందని పరిశీలకులు అంటున్నారు.

అమెరికా లాగే వడ్డీ రేటు పెంచిన ఐరోపా

ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌ చేసేందుకు.. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌.. వడ్డీ రేటును సున్నా పాయింట్‌ 5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. ఐరోపాలోని సెంట్రల్‌ బ్యాంకులు కూడా అదే బాటలో నడవటం ఆసక్తికరంగా మారింది. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ కూడా అర శాతం చొప్పున వడ్డీ రేటు పెంచాయి. భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉంటాయని, అయితే అవి దూకుడుగా మాత్రం ఉండబోవని బ్రిటన్‌ కేంద్ర బ్యాంకు పేర్కొనటం కాస్త ఊరట కలిగించే విషయం.

Exit mobile version