Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) బేబీ పౌడర్‌తో పాటు టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ అమెరికాలో దాఖలైన వేలాది కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా బాధితులకు సుమారు రూ.52 వేల కోట్ల పరిహారం చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అంగీకరించింది. అమెరికా వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్‌పై దాదాపు 76 వేల పిటిషన్లు నమోదయ్యాయి. వీరిలో కనీసం 95 శాతం మంది ఈ సెటిల్‌మెంట్‌కు ఒప్పుకుంటే ఈ డీల్ అమల్లోకి రానుందని సమాచారం. లేదంటే కంపెనీపై కోర్టు విచారణలు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు తమ టాల్క్ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవేనని, వాటిలో క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆరోపిస్తున్న ఆస్బెస్టాస్ లేదని జాన్సన్ అండ్ జాన్సన్ వాదిస్తూ వచ్చింది. అండాశయ క్యాన్సర్‌కు తమ ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదని కూడా సంస్థ పలుమార్లు స్పష్టం చేసింది.
అయితే దశాబ్దానికి పైగా కొనసాగుతున్న న్యాయపోరాటాలు, భారీ న్యాయ వ్యయాలు కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఈ కేసుల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పటికీ, సంస్థ ప్రధాన వ్యాపార లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ఈ సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్లు వెల్లడించింది. ఈ పరిహారంలో తొలి విడతగా 2027లో 3 బిలియన్ డాలర్లు, మిగిలిన మొత్తాన్ని 2028లో చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది. కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌తో పాటు ఇతర టాల్క్ ఉత్పత్తులను దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు అమెరికా కోర్టులను ఆశ్రయించారు. ఈ ఆరోపణలను సంస్థ ఖండించినప్పటికీ, 2020లో అమెరికాలో టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేసి, దాని స్థానంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

