Isha Ambani: దేశంలో ఇంటర్నెట్ అంటే జియో రాకముందు.. జియో వచ్చిన తర్వాత అని చెప్పుకునేంతలా టెలికాం రంగ రూపురేఖలనే మార్చేసింది రిలయన్స్ సంస్థ. సామాన్యుడి చేతికి కూడా రూపాయి ఖర్చు లేకుండా నెట్ డేటాను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పెద్ద డిజిటల్ విప్లవానికే తెరతీసింది. కానీ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అసలు ఐడియా ఎక్కడ మొదలైంది? ముఖేష్ అంబానీ ఇంట్లో జియో ఆలోచనకు బీజం ఎలా పడింది? ఈ విషయాన్ని ఆయన కూతురు ఈషా అంబానీ తాజాగా సరదాగా బయటపెట్టారు. ఒక చిన్న కాలేజ్ అసైన్మెంట్ సబ్మిట్ కాకపోవడమే ఈ భారీ నెట్వర్క్ పుట్టుకకు కారణమని ఆమె చెప్పిన ముచ్చట ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈషా అంబానీ చెప్పిన వివరాల ప్రకారం.. 2009-10 ఆ టైమ్‌లో ఆమె, తన అన్నయ్య ఆకాష్ అంబానీ ఇద్దరూ అమెరికాలో కాలేజీ చదువులు చదువుతున్నారు. సెలవుల్లో సరదాగా గడపడానికి ముంబైలోని తమ ఇంటికి వచ్చారు. సరిగ్గా అదే టైంలో ఈషా తన కాలేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అసైన్మెంట్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి వచ్చింది. కానీ తీరా చూస్తే ఇంట్లోని నెట్ సరిగ్గా పనిచేయక మొరాయించింది. ఎంత ట్రై చేసినా స్పీడ్ లేక ఆ ప్రాజెక్ట్ అప్లోడ్ కాలేదు. ఆ సమయంలో వచ్చిన కోపం, చిరాకు ఈ అన్నాచెల్లెళ్లు మధ్య ఒక సీరియస్ చర్చకు దారితీసింది. “అమెరికాలో ఎంత స్పీడ్‌గా ఉండేది నెట్.. మన ఇండియాలో మాత్రం ఎందుకు ఇంత ఘోరంగా ఉంది? మన దేశంలో ఉండేవాళ్లకు కూడా మంచి స్పీడ్‌తో కూడిన ఇంటర్నెట్ ఇవ్వలేమా?” అని ఇద్దరూ మాట్లాడుకున్నారు.
చిన్న అసౌకర్యం.. వేల కోట్ల బిజినెస్ ఐడియాగా
అప్పట్లో మన దేశంలో నెట్ వాడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. మొబైల్ డేటా కూడా చాలా తక్కువగా ఉండేది, స్పీడ్ కూడా అంతంత మాత్రమే. కానీ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అనేది కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కాదని, చదువు, బిజినెస్, వినోదం ఇలా ప్రతిదానికీ అదే ప్రాణంగా మారుతుందని వాళ్లు ముందే పసిగట్టారు. దేశంలో అందరికీ అందుబాటులో ఉండేలా చవకైన ఇంటర్నెట్ తేవాలని ఇంట్లో ముఖేష్ అంబానీ దగ్గర ప్రస్తావించారు. అలా పిల్లలిద్దరి మధ్య మొదలైన చిన్నపాటి చర్చే.. రిలయన్స్ బోర్డు రూమ్‌లోకి వెళ్లి భారీ డిజిటల్ ప్లాన్‌గా రూపాంతరం చెందింది. ఈ ఆలోచనకు అంబానీ భారీ పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ తోడవడంతో చివరకు 2016 సెప్టెంబర్‌లో ‘జియో’ రూపంలో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఫ్రీ కాల్స్, తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటాతో దేశంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్ వాడకాన్ని పరుగులు పెట్టించింది. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ.30,213 కోట్లు సమీకరించేందుకు ఐపీవోకి సిద్ధమవుతున్న ఈ టైమ్‌లో ఈషా అంబానీ పాత రోజులను గుర్తుచేసుకోవడం విశేషం. జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి సమస్య నుంచే సరైన ఆలోచన వస్తే దేశాన్ని కదిలించే సరికొత్త వ్యాపారాలు ఎలా పుడతాయో చెప్పడానికి ఈ జియో కథే సరైన ఉదాహరణ అని చెబుతున్నారు.

