దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల రోజుకు వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీనివల్ల కంపెనీ మూడో త్రైమాసికానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌లో భారీ ఆర్థిక నష్టం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు విమానాల రద్దు కారణంగా ఇండిగోకు సుమారు రూ. 1,800 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. డిసెంబర్ 9 వరకు టిక్కెట్ల రద్దు మూలంగా మాత్రమే ఎయిర్‌లైన్ ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా తక్షణ నష్టాన్ని భరించింది. ఇది ప్రయాణికులకు టిక్కెట్ రీఫండ్ రూపంలో తిరిగి చెల్లించిన మొత్తం.
అయితే విమానాల ఆలస్యం వల్ల రద్దైన టిక్కెట్లపై పరిహారం చెల్లించాల్సి వచ్చినట్లయితే ఆర్థిక భారం ఇంకా ఎక్కువయ్యే అవకాశముంది. ఎయిర్‌లైన్ వివరాల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 9 వరకు మొత్తం 8.86 లక్షల పీఎన్ఆర్‌లను రద్దు చేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల చార్టర్ ప్రకారం, 2 గంటలకు పైగా ప్రయాణించే విమానాన్ని రద్దు చేసి, 24 గంటల ముందుగా సమాచారం ఇవ్వనప్పుడు ఎయిర్‌లైన్ రూ. 10,000 లేదా ప్రాథమిక ఛార్జ్‌తో పాటు ఇంధన ఛార్జ్ ఈ రెండిటిలో తక్కువ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలి.
ఈ చార్టర్ ప్రకారం ఇండిగో డిసెంబర్ 9 వరకు చెల్లించవలసిన పరిహారం రూ. 886 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి అధికారికంగా పరిహారం చెల్లించాలని ఆదేశాలు వచ్చినట్లయితే, రీఫండ్లు మరియు పరిహారాలతో కలిపి మొత్తం భారం దాదాపు రూ. 1,800 కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే తక్కువ దూర ప్రయాణాలకు పరిహారం తక్కువగా ఉండటం వల్ల మొత్తాల్లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు.