Lentil imports: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ప్రధాని నేరుగా భారత్ పై విమర్శలు గుప్పించడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇక భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఈ దౌత్య వివాదం, వాణిజ్య వివాదంగా మారుతుందా..? అనే భయాలు పట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాల దిగుమతులు మందగించినట్లు తెలుస్తోంది. భారత దేశానికి దిగుమతులు తగ్గితే కెనడా రైతులకు తక్కువ ధరకు దారి తీయవచ్చు. ఇదే సమయంలో భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది.
దేశంలో లభ్యత తగ్గడంతో గతేడాది భారత్ గోధుల ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతీయేతర వైట్ రైస్ పై కూడా నిషేధం విధించింది. దీని ద్వారా దేశీయంగా లభ్యత పెంచడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Read Also: UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
ఇండియాలో ప్రధాన దిగుమతిదారుగా ఉన్న ఓలమ్ అగ్రి ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాణిజ్య ఆంక్షలు రావచ్చనే ఆందోళన వెలిబుచ్చారు. కెనడా నుంచి దిగుమతులను తిరస్కరించాలని ప్రభుత్వం దిగుమతిదారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఓ అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కెనడా గ్లోబల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు కెనడా ప్రస్తుతం భారత్‌తో వాణిజ్యంపై ప్రభావం చూపే ఎలాంటి ప్రత్యక్ష చర్య తీసుకోలేదని తెలిపారు. ఇండియాలో పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉంది. భారత్ లో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కెనడా ప్రధాని భారత్ పై ఆరోపణలు చేసిన తర్వాత కెనడా నుంచి సప్లైలో 6 శాతం తగ్గాయని విన్నిపెగ్ కు చెందిన క్రాప్ ట్రేడర్ పారిష్ అండ్ హెమ్ బేకర్ వ్యాపారి కెవిన్ ప్రైస్ తెలిపారు.
పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా నుంచి సగం ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కెనడియన్ పప్పు ధాన్యాల దిగుమతులు ఏడాదికి 420 శాతం పెరిగి 1,90,784 టన్నులకు చేరుకుంది. అయితే వాణిజ్య ఆంక్షల భయంతో కెనడాపై ఎక్కువగా ఆధారపడకుండా భారతీయ కొనుగోలుదారులు ఆస్ట్రేలియా వంటి ప్రత్నామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు.