Stock Market: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. ఇరాన్ – అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ రోజు మార్కెట్లో ఒకానొక దశలో సెన్సెక్స్ దాదాపు 2,900 పాయింట్లకు పైగా పెరిగి 77,600 మార్కును తాకింది. నిఫ్టీ దాదాపు 890 పాయింట్ల భారీ పెరుగుదలతో 24,000 మైలురాయిని అధిగమించింది. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర పెరగడం గమనార్హం.
READ ALSO: dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!
మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు ఇవే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం, ఇన్వెస్టర్లలో యుద్ధ భయాలను తాత్కాలికంగా తొలగించింది. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది (దాదాపు 13% పతనమై $95 వద్దకు చేరింది). ఇది భారత్ లాంటి దేశాలకు భారీ ఊరట కలిగించే విషయం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను యథాతథంగా (5.25%) కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా మార్కెట్‌కు సానుకూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 50 పైసల మేర పెరిగి 92.56 వద్దకు చేరింది. ఇవన్నీ భారీ లాభాలకు కారణం అయ్యాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ రోజు మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు 13% వరకు లాభపడగా, ఇండిగో, ఎల్ అండ్ టీ (L&T), బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి.
READ ALSO: TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
