కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్ చూపినంత ప్రభావం సెకండ్ వేవ్ చూపలేదని చెబుతోంది ఆర్బీఐ.. అయితే, అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్న ఆర్బీఐ.. తిరిగి పుంజుకోవడానికి మాత్రం.. ప్రైవేటు డిమాండ్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకొచ్చింది.. కరోనా సెకండ్ వేవ్‌ను ఎంత వేగంగా భారత్ అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి, అవకాశాలు ఆధారపడిఉన్నాయని తెలిపింది.. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది ఆర్బీఐ..
ఇక, కరోనా మహమ్మారి తర్వాత జీడీపీ వృద్ధి కోసం ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ జరగాల్సి ఉందని పేర్కొంది ఆర్బీఐ.. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ వాటా జీడీపీలో దాదాపు 85 శాతం వరకు ఉంటుందని.. పెట్టుబడుల కన్నా వినియోగం ద్వారానే సంక్షోభానంతరం కోలుకోవడం ఎక్కువగా జరుగుతుందని పేర్కొంది. అయితే, పెట్టుబడుల ద్వారా కోలుకోవడం వల్ల మరింత గట్టిగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని, తద్వారా మెరుగైన ఉపాధి సృష్టి జరిగేందుకు అవకాశం ఉంటుందని.. కొంత వరకు వినియోగాన్ని పెంచవచ్చునని ఆర్బీఐ వివరించింది… మరోవైపు.. సవరించిన అంచనాలు విడుదల చేసినప్పుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లోటు పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది ఆర్బీఐ.. ఇక, 2021 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 6.99 శాతం పెరగడంతో.. రూ.57.08 ట్రిలియన్లకు పెరిగిందని.. ఆదాయం 10.96 శాతం తగ్గిందని, అదే సమయంలో ఖర్చు కూడా 63.10 శాతం తగ్గిందని స్పష్టం చేసింది.. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల నుంచి నెట్ గెయిన్స్ ఆర్థిక సంవత్సరం 20లో రూ.29.993 బిలియన్లు అని, ఆర్థిక సంవత్సరం 21లో 506.29 బిలియన్లు అని ఆర్బీఐ తెలిపింది..