NTV Telugu Site icon

India-China : ట్రంప్ ప్రకటనతో చైనాకు షాక్.. భారత్‌కు లక్కీ ఛాన్స్ గురూ.. !

India China

India China

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అమెరికాకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఐదు కీలక రంగాలకు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ 5 రంగాల్లో ఎగుమతులను పెంచడం ద్వారా చైనాతో నేరుగా పోటీ పడాలని భారత్ యోచిస్తోంది. ఈ 5 రంగాల్లో ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, రసాయనాలు, తోలుతో చేసిన పరికరాలు ఉన్నాయి.

ట్రంప్ ప్లాన్ ఏంటి?
వచ్చే ఏడాది జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను పెంచుతామని ట్రంప్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. చైనా నుంచి అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయడం ఖరీదుగా మారుతుంది. దీంతో ఈ చైనా వస్తువులను అమెరికాలో విక్రయించాలంటే వాటి రేటు పెంచాల్సి వస్తుంది.

భారతదేశ ప్రణాళిక ఏమిటి?
ఈ సందర్భంగా భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ.. “ఈసారి మనం చురుగ్గా ఉండాలి. ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, రసాయనాలు, తోలు రంగాలకు చెందిన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ వ్యూహానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఈ వస్తువులను ఎగుమతి చేసేందుకు అవసరమయ్యే పెద్ద ఫ్యాక్టరీల సామర్థ్యం అవసరం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ (ఎంఎఐ) పథకం కింద మరిన్ని నిధులను కోరుతున్నాం. అలాగే ఎగుమతులపై జీడీపీ పునరుద్ధరణ విషయంలో  ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ప్రణాళిక ప్రకారం.. కనీసం మూడేళ్లపాటు అమెరికాపై దృష్టి పెట్టాలి. యుఎస్ మార్కెట్‌లో దూకుడును భారత్ అందిపుచ్చుకోవాలి. ” అని వెల్లడించారు.

భారత్- అమెరికా మధ్య వాణిజ్యం ఎలా ఉంది?
గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. 2017 -2023 మధ్య ఎగుమతులు $36.8 బిలియన్లకు చేరుకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, టెలికాం పరికరాల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. బట్టలు, మోటారు వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్లు మొదలైన వాటి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.

చైనాపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
భారత్ తన ప్రణాళికలో విజయం సాధిస్తే చైనాను వస్తువుల ఎగుమతుల్లో ఓడించవచ్చు. భారత్‌పై టారిఫ్‌ల విధింపుపై ట్రంప్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటువంటి పరిస్థితిలో.. చైనా వస్తువులు అమెరికాలో ఎక్కువ రేటు పలుకుతాయి. భారతీయ వస్తువులు చౌకగా మారుతాయి. చైనీస్ వస్తువులు అమ్మకాలు తగ్గుతాయి. దీని కారణంగా భారతీయ కంపెనీలు అమెరికన్ మార్కెట్లో సులభంగా రాణించవచ్చు. దీని ప్రభావం చైనా కంపెనీలు, చైనా ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది.

Show comments