Amazon Layoffs: టెక్ దిగ్గజం అమెజాన్ యూరప్ ప్రధాన కార్యాలయం ఉన్న లక్సెంబర్గ్‌లో భారీ స్థాయిలో లేఆఫ్స్ కు సిద్ధమైంది. రాబోయే కొన్ని వారాల్లో అక్కడి కార్యాలయంలో 370 ఉద్యోగాలను తొలగించబోతుందని స్థానిక మీడియా వెల్లడించింది. లక్సెంబర్గ్ కేంద్రంలో అమెజాన్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఉద్యోగ కోతగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం లక్సెంబర్గ్‌లో అమెజాన్‌కు సుమారు 4,370 మంది ఉద్యోగులు ఉండగా, తాజా లేఆఫ్స్ మొత్తం సిబ్బందిలో 8.5 శాతం మేరకు ఉంటాయి. గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా 14,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం, వ్యయాలను తగ్గించుకోవడం టార్గెట్ గా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Read Also: Congress: మూడో విడతలోనూ హస్తం హవా.. ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
అయితే, లక్సెంబర్గ్ టైమ్స్ కథనం ప్రకారం.. యూరోపియన్ యూనియన్ కార్మిక చట్టాల మేరకు ఉద్యోగుల ప్రతినిధులతో రెండు వారాల పాటు చర్చలు జరిపిన అనంతరం ఒక సామాజిక ఒప్పందంపై అమెజాన్ సంతకం చేసింది. తొలుత కంపెనీ 470 ఉద్యోగాలను తొలగించాలని భావించినప్పటికీ, చర్చల తర్వాత ఆ సంఖ్యను 370కి తగ్గించింది. దీని వల్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. కోడింగ్ పనుల్లో AI వినియోగాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
Read Also: Donald Trump: నాకు ఇంగ్లీష్ భాషలో అత్యంత ఇష్టమైన పదం “టారిఫ్స్”
ఇక, బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడిన ఓ అమెజాన్ ఉద్యోగి.. ఒకేసారి వందలాది మంది ఉద్యోగులు లక్సెంబర్గ్ లోని ప్రధాన కార్యాలయం నుంచి తొలగించబడుతున్నారని పేర్కొన్నాడు. కేవలం 6.8 లక్షల జనాభా ఉన్న దేశంలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చి పని చేస్తున్న ఎంప్లాయ్స్ రాబోయే మూడు నెలల్లో కొత్త ఉద్యోగం దొరకకపోతే దేశం విడిచి పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించిందని తెలిపారు. ఈ ఉద్యోగ కోతలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభావిత ఉద్యోగులకు సహాయం చేయడం, మార్పు దశలో మద్దతు అందించడం తమ తక్షణ లక్ష్యమని అమెజాన్ ప్రతినిధి ప్రకటించారు. అయితే, సీఈఓ ఆండీ జాసీ నేతృత్వంలో అమెజాన్ సంస్థను “తక్కువ ఖర్చుతో, తక్కువ బ్యూరోక్రసీతో పని చేసేలా” మార్చడంతో పాటు జెనరేటివ్ AIలో భారీ పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. కోవిడ్ సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన అమెజాన్, 2022–2023 మధ్య ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది.