ప్రభుత్వం అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తోంది.. కొన్ని శ్లాబుల్లో జీఎస్టీని సవరిస్తూ వస్తున్నారు.. ఇప్పటి వరకు మినహాయింపు ఉన్నవాటిని కూడా క్రమంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.. ఇక, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. అవి జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.. ఓలా, ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదుగా మారిపోతున్నాయి.. అయితే, వీధుల్లో తిరిగే ఆటో రైడ్‌లపై మాత్రం ఎలాంటి జీఎస్టీ ఉండదు.. కానీ, యాప్ ఆధారిత అగ్రిగేటర్లు ఉబర్, ఓలా, రాపిడో వంటి వాటికి ఇవి వర్తించనున్నాయి.
Read Also: నల్లగొండ అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక.. కీలక ఆదేశాలు
మరోవైపు.. కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి ఆన్‌లైన్ ఆటో బుకింగ్ యాప్‌లు.. ఓవైపు కోవిడ్ మహమ్మారి వల్ల ఆటోరిక్షాలు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆంక్షల వల్ల.. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిందని.. కేంద్రం కొత్త నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల, ప్రయాణీకుల సమస్యలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్‌కు జీఎస్టీ మినహాయింపు ఉంది.. కానీ, దానిని కేంద్రం ఉప సంహరించుకోవడంతో.. ఆటో రైడ్‌పై 5 శాతం జీఎస్టీ వడ్డింపు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.