GST Council: దీపావళి పండగ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిన్న(సెప్టెంబర్ 3న) జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చాలా వస్తువులపై జీఎస్టీ శాతాన్ని తగ్గించారు. పూర్తి జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!
నిత్యవసర వస్తువులు: తలనూనె, షాంపూ, టూత్‌పేస్ట్, సబ్బులు, టూత్‌బ్రేష్, షేవింగ్ క్రీమ్ లపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండగా.. ప్రస్తుతం 5 శాతానికి తగ్గించారు.
పాల ఉత్పత్తులు: వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ- ప్యాకేజ్డ్ నమ్‌కిన్, భుజియా, మిక్చర్, వంట సామగ్రి, పాలసీసాలు, డైపర్లు, కుట్టుమిషన్లపై 12 శాతం నుంచి 5 శాతానికి కుదించారు.
ఆరోగ్య సంరక్షణ: వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయించారు. గతంలో వీటిపై 18శాతం జీఎస్టీ విధించిన కేంద్ర సర్కార్ దాన్ని సున్నాకు కుదించింది. థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్‌లు, గ్లూకోమీటర్, కళ్లజోళ్లపై ఇక నుంచి కేవలం 5 శాతం జీఎన్టీ వసూలు చేయనున్నారు.
వాహనాలకు సంబంధించినవి: పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, 1200 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం గల ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లు, డీజిల్, 1500 సీసీలోపు గల డీజిల్ హైబ్రిడ్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 350 సీసీ సామర్థ్యం కలిగిన బైక్స్, రవాణా కోసం వాడే మోటారు వాహనాలపై గతంలో 28 శాతం జీఎస్టీ విధించగా తాజాగా 18 శాతానికి తగ్గించారు.
విద్య: మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్‌లు, పెన్సిళ్లు, షార్పనర్‌లు, క్రేయాన్స్, ప్యాస్టెల్స్, ఎక్సర్‌సైజ్ పుస్తకాలు, నోట్‌బుక్స్, ఎరేజరుపై జీఎస్టీ మినహాయించారు.
వ్యవసాయ రంగం: ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, స్ర్పింక్లర్లు, వ్యవసాయ పరికరాలపై 5 శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తారు.
విద్యుత్తు గృహోపకరణాలు: ఏసీలు, టీవీలు (32 అంగుళాల పైబడిన), మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్లపై గతంలో 28 శాతం జీఎస్టీ విధించగా.. ప్రస్తుతం 18 శాతానికి తగ్గించారు.