NTV Telugu Site icon

Google Layoff: “నా గుండె పగిలిపోయింది”.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే గూగుల్ ఉద్యోగి లేఆఫ్..

Google Layoff

Google Layoff

Google Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగిని గూగుల్ కంపెనీ కొలువు నుంచి తీసేసింది. కంపెనీలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న సదరు ఉద్యోగి ఉద్యోగం పోయే సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చి 10 వారాలైంది. ఉద్యోగం పోవడంపై సదరు మహిళ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తనను ఉద్యోగం నుంచి తీసేసిన సమయంలో 10 వారాల పాపతో ఉన్నానని లింక్డ్‌ఇన్ లో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసిన వెంటనే తన గుండె పగిలిందని ఆమె పోస్టులో తన బాధను వ్యక్త పరిచింది. ఇన్నాళ్లు గూగుల్ సంస్థలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Disney+ Hotstar: పాస్‌వర్డ్ షేరింగ్‌కి హాట్‌స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..

కొత్త ఉద్యోగంలో గుర్తించడం, ఇంటర్వ్యూలకు హాజరవ్వడం కష్టంగా మారిందని మహిళా ఉద్యోగి రాసుకొచ్చారు. పాజిటివ్ మైండ్ సెట్ కొనసాగిస్తూ తదుపరి ఏం జరుగుతోందో చూడటానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు రాసింది. ఏదైనా కంపెనీలో స్టాఫింగ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్ రోల్స్ ఏమైనా ఉంటే తనను గుర్తుపెట్టుకోవాలని కోరింది.

ఈ నెల ప్రారంభంలో గూగుల్ తన రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది ఉద్యోగులను తొలగించింది. దీనికి ముందు గతేడాది నుంచి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12000 మంది ఉద్యోగులను ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. గూగుల్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా గతేడాది నవంబర్ లో 11,000 మందిని, అంటే తన కంపెనీ వర్క్ ఫోర్సులో 13 శాతాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ తన ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించాయి.