Site icon NTV Telugu

Gold Rates Down: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..

Gold Rate

Gold Rate

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు ఒక్కరోజే భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు దిగివచ్చాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,240 తగ్గి, రూ.1,57,420 వద్దకు చేరింది. నిన్నటి వరకు రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్న పసిడి, ఈ భారీ తగ్గుదలతో కొంత ఊరటనిస్తోంది. అదేవిధంగా.. ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,050 తగ్గి, ప్రస్తుతం రూ.1,44,300 వద్ద స్థిరపడింది. కేవలం బంగారమే కాకుండా వెండి కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర ఈరోజు రూ.4,000 మేర క్షీణించి.. రూ.2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు దాదాపుగా అమల్లో ఉండే అవకాశం ఉంది.

Also Read:Gas Cylinder: ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉండాలి..? ఈ నిబంధనలు తెలియకపోతే జైలుకే..

ధరలు తగ్గడానికి కారణం ఏంటి..?
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా నిలకడగా పెరిగిన ధరల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించడం వల్ల మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి.

ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం సామాన్య ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. అయితే.. అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరల్లో నిరంతరం మార్పులు ఉండే అవకాశం ఉన్నందున.. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండటం మంచిది.

Exit mobile version