NTV Telugu Site icon

మళ్లీ 50వేల మార్క్‌ దాటిన పసిడి ధర

Gold

Gold

పసిడి ప్రేమికులకు షాకింగ్‌ న్యూస్.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగింది.. ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం ధర.. కాస్త ఊరట కలిగిస్తూ మళ్లీ దిగివచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ పైకి కదులుతూ 50 వేల మార్క్‌ను క్రాస్‌ చేశాయి.. దీంతో.. హైదరాబాద్‌లో చాలా నెలల తర్వాత రూ.50 వేలస్థాయిని దాటినట్టు అయ్యింది.. గురువారం హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.760 పెరిగి, 50,070కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 మేర ఎగసి రూ. 45,900 స్థాయిని తాకింది.. ఈ ఏడాదిలో జూలై 21 తర్వాత పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు… ఇదేబాటలో భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర 9 నెలల గరిష్ఠం రూ.49,277 వద్దకు ఎగిసింది.

మరోవైపు పుత్తడి దారిలోనే వెండి కూడా పెరిగింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,300 మేర పుంజుకుని, రూ. 70,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 1860 డాలర్ల పైకి చేరడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పరుగులు పెడుతోందని.. దానికి తోడు శుభకార్యాలు, పెళ్లిళ్లతో డిమాండ్‌ పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.09 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1862 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా కొద్దిగా క్షీణించింది. ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 25.29 డాలర్లకు తగ్గింది.