ఉద్యోగులకు ఆయా కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి శాలరీ నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవగాహన లేక విత్ డ్రా చేసుకోలేక పోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని తీసుకొస్తుంది. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఖాతాదారులకు ప్రయోజనం కలుగనున్నది. పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవడమే కాకుండా కొత్త యాప్ కూడా అందుబాటులో రానుంది. కాగా ఈ కొత్త విధానం ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి రానున్నది. ఇటీవలే కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా ఈపీఎఫ్ఓ 3.0 ను లాంచ్ చేశారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం పీఎఫ్ సభ్యులందరికీ ఏటీఎం కార్డులు జారీ అవుతాయి.
వీటిసాయంతో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం అమల్లోకి వస్తే పీఎఫ్ డబ్బులు ఈజీగా చేతికి అందుతాయి. అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఈ సౌకర్యాలతో పాటు మరింత ప్రయోజనం చేకూరేలా కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈపీఎఫ్ఓ రూల్స్ లో మార్పులు చేస్తూ ఖాతాదారులకు సేవలు మరింత చేరువ చేస్తుంది.