దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే ముగిసింది. రెండు కీలక సూచీలు సైతం రోజంతా ఊగిసలాట ధోరణిలోనే సాగాయి. సెన్సెక్స్ అతి స్వల్పంగా 9 పాయింట్లు తగ్గి 60 వేల 105 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు తగ్గి 17 వేల 895 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్సులోని మొత్తం 30 కంపెనీల్లో 14 కంపెనీలు లాభాల బాటలో సాగాయి. ఎడెల్వీస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎయిర్టెల్, సోనా బీఎల్ డబ్ల్యూ, వరుణ్ బేవరేజెస్ బాగా దెబ్బతిన్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్, మిడ్ క్యాప్ హండ్రెడ్ జీరో పాయింట్ 5 శాతం పెరిగాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే నిఫ్టీ ఐటీ, మీడియా, మెటల్ ఇండెక్సులు ఎక్కువగా.. అంటే.. ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో సూచీలు జీరో పాయింట్ 3 శాతం వరకు తగ్గాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. ట్రాన్స్ ఫార్మర్ అండ్ రెక్టిఫయర్ ఇండియా షేర్లు 10 శాతం వరకు ర్యాలీ తీసి కొన్నేళ్ల గరిష్టానికి చేరాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ స్టాక్స్ రెండు శాతానికి పైగా రాణించి పదేళ్ల గరిష్టానికి.. అంటే.. 610 రూపాయలకు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 186 రూపాయలు పెరిగి 55 వేల 898 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి 615 రూపాయలు లాభపడి అత్యధికంగా 68 వేల 978 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 19 పైసలు తగ్గిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 58 పైసలుగా నమోదైంది.