ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్ తప్పదా..? వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్‌వోపై ఇచ్చే వడ్డీ రేట్లను కోతపెట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.. సెంట్రల్ బోర్డ్ ఆఫర్ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. ఇది గనుక అమలు చేస్తే.. ఖాతాదారులకు షాక్ తగిలినట్టే..
కాగా, వడ్డీ రేట్లను కోత పెడితే.. 40 ఏళ్ల తర్వాత తగ్గించినట్టు అవుతుంది.. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్‌వో ఖాతాలపై 8శాతం వడ్డీ ఉండగా.. ఆ తర్వాత క్రమంగా పెరిగింది.. కొన్నిసార్లు తగ్గినా.. మళ్లీ పెరిగింది. కానీ, మళ్లీ 40 ఏళ్ల తర్వాత అదే తరహాలో వడ్డీ రేట్లు ఇవ్వడానికి మొగ్గుచూపడం చర్చగా మారింది.. గతంలో ఏ ఏడాదిలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. 2011 -2012 లో 8.25శాతంగా ఉండగా.. 2012-2013 లో 8.5 శాతానికి పెంచారు.. ఇక, 2013-2014 లో 8.75 శాతానికి చేరింది.. 2015 -2016లో 8.8 శాతానికి ఎగబాకగా.. 2016 – 2017లో అది 8.65శాతానికి పరిమితం చేశారు.. 2017 – 2018లో 8.55శాతానికి దిగింది.. ఇక, 2018 -2019 లో 8.65 శాతానికి పెరగగా.. 2019-2020లో 8.5శాతానికి పరిమితం చేశారు. 2020-2021లోనూ 8.5 శాతాన్ని కొనసాగించారు.. కానీ, 2021 -2022లో 8.1శాతానికి వడ్డీ రేట్లను కొత్తపెట్టేందుకు సిద్ధం అయినట్టు నివేదికలు చెబుతున్నాయి.