NTV Telugu Site icon

Elon Musk: ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన.. 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై కీలక ప్రకటన..

Elon Musk, Pm Modi

Elon Musk, Pm Modi

Elon Musk: టెస్లా చీఫ్, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఎలక్ట్రిక్ కార్ నిర్మాణానికి సంబంధించి టెస్లా ప్లాంట్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భారత ప్రధాని మోడీతో ఎలాన్ మస్క్ భేటీ కానున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సోమవారం భారత్‌లో జరిగే మస్క్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పర్యటనలో ఇండియాలో టెస్లా కార్ ప్లాంట్ కోసం 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్లాకు చెందిన టీం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు టెస్లా ప్లాంట్‌కి అనుకూలంగా ఉన్నాయని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష స్టార్టప్‌లతో భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి కూడా ఎలోన్ మస్క్ హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Angry Rantman: ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత.. విషాదంలో నెటిజన్లు

భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రానిక్ వాహనాల(ఈవీ) ఇండస్ట్రీ ఊపందుకుంది. ప్రస్తుతం ఈవీ కార్లలో మార్కెట్ లీడర్‌‌గా టాటా ఉంది. 2023లో మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీలు 2 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే, 2030 నాటికి దీన్ని 30 శాతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా, చైనాలో టెస్లా అమ్మకాలు మందగించడంతో భారత్‌ వైపు ఎలాన్ మస్క్ దృష్టి సారించారు.

గత కొన్నేళ్లుగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. అయితే, భారత్ స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంతో టెస్లా కార్లు ఇతర దేశాల్లో తయారై భారత్‌లోకి దిగుమతి చేస్తే భారీగా సుంకాలను విధిస్తానమి చెప్పింది. అయితే, 500 మిలియన్ల పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే 100 శాతం ఉన్న సుంకాలను 15 శాతానికి తగ్గించే కొత్త ఈవీ పాలసీని మార్చి నెలలో ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో టెస్లా ఇండియా ఎంట్రీకి అవకాశాలు ఏర్పడ్డాయి. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యేంత వరకు ఇతర దేశాల నుంచి టెస్లా కార్లు ఇండియాలోకి పరిమిత సంఖ్యలో దిగుమతి కానున్నాయి. ఇప్పటికే జర్మనీలో ఇండియా కోసమని ప్రత్యేకంగా రైట్ హ్యాండ్ డ్రైవ్(RHD) కార్లను ఉత్పత్తి చేస్తోంది.