క్రిప్టో కరెన్సీలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. బిట్ కాయిన్ ధర మరోసారి భారీగా పతనమైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా డిజిటల్ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. క్రిప్టో మార్కెట్ పడిపోతుండటంతో బిట్ కాయిన్ విలువ 25వేల డాలర్ల దిగువకు పడిపోయింది. సోమవారం ఉదయం బిట్‌కాయిన్ 25,745 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. గత ఐదురోజుల్లో బిట్ కాయిన్ 15 శాతం నష్టపోయింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ క్రిప్టో కరెన్సీ ధర 35 శాతానికి పైగా కుప్పకూలింది. నవంబర్‌లో 69 వేల డాలర్ల రికార్డు స్థాయిలను తాకిన తర్వాత నుంచి బిట్ కాయిన్ నష్టాల్లోనే ట్రేడవుతోంది. మరోవైపు బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీల పరిస్థితి కూడా దిగజారిపోయింది. క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్ మార్కెట్ షేర్ 44.7 శాతం ఉండగా.. దీని తర్వాతి స్థానంలో ఇథెరియానికి ఉంది. దీని వాటా 16.2 శాతంగా ఉంది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌తో పాటు ఇథెరియం పరిస్థితి కూడా అధ్వాన్నంగానే ఉంది. గత 5 రోజుల్లో ఈ కరెన్సీ విలువ దాదాపు 25 శాతం పడిపోయింది. ఇథెర్ కాయిన్ ధర 6.9 శాతం తగ్గి 1,673.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అటు డోజ్‌కాయిన్ విలువ 4.1 శాతం నష్టపోయి 0.076157 డాలర్ల వద్ద, శిభు ఇను ధర 3.4 శాతం నష్టపోయి 0.00001024 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.