Craigslist Success Story: సంకల్పం మంచిది అయితే విజయం నిన్ను వెతుక్కుంటూ వచ్చి వరిస్తుంది.. ఇది మన పెద్దలు చెప్పిన మాట. అక్షరాల ఈ మాట నిజం అయ్యింది. ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఓ వ్యక్తి తన స్నేహితుల కోసం ఒక సాధారణ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. ఆయనకు దానిపై డబ్బులు సంపాదించాలని ఆలోచనే లేదు. కేవలం తన స్నేహితులతో స్థానిక కార్యక్రమాల గురించి సమాచారాన్ని పంచుకోవడం కోసం తయారు చేశాడు. ఎలాంటి విస్తృతమైన సన్నాహాలు లేని, వ్యాపార ప్రణాళికలు లేని ఆ వెబ్‌సైట్ ఇప్పుడు కోట్లు సంపాదించి పెడుతుంది. ఇంతకీ దాని కథ ఏంటి, ఎందుకు ఈ వెబ్‌సైట్ అంత స్పెషల్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!
అప్పుడే ఇంటర్నెట్ వస్తున్న రోజులు..
అది 1995 అప్పుడే ప్రజల జీవితాల్లోకి ఇంటర్నెట్ ప్రవేశించడం ప్రారంభమైంది. ఈ సమయంలో క్రెయిగ్ న్యూమార్క్ అనే వ్యక్తి తన స్నేహితుల కోసం ఒక సాధారణ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. ఆయన ఈ వెబ్‌సైట్‌ను సృష్టించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం సరళమైనది, సూటిగా ఉంది. ఏంటా ఉద్దేశం అంటే స్థానిక కార్యక్రమాల గురించి సమాచారాన్ని స్నేహితులతో పంచుకోవడం కోసం ఆయన ఈ వెబ్‌సైట్‌ను తయారు చేశాడు. ఆయనకు ఈ వెబ్‌సైట్ విషయంలో ఎలాంటి విస్తృతమైన సన్నాహాలు, వ్యాపార ప్రణాళికలు లేదు, కేవలం ఒక చిన్న ఆలోచన మాత్రమే ఉంది.
‘పెద్ద విషయాలు చిన్న ఆలోచనలతో ప్రారంభమవుతాయి’ అని పెద్దలు తరుచుగా చెప్పే అతి ముఖ్యమైన మాట ఆయన జీవితంలో నిజం అయ్యింది. క్రెయిగ్ న్యూమర్క్ తన వెబ్‌సైట్‌కు తన పేరునే పెట్టుకున్నాడు – క్రెయిగ్స్‌లిస్ట్. మెల్లమెల్లగా ప్రజలు వెబ్‌సైట్‌ను సందర్శించడం ప్రారంభించారు. అలా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించే ప్రజలు క్రెయిగ్‌ను ఉద్యోగాలు పోస్ట్ చేయగలరా, వస్తువులను అమ్మకానికి పెట్టగలరా, అలాగే తమ స్వంత కంపెనీకి నియామకాలు పోస్ట్ చేయగలరా అని అడగడం ప్రారంభించారు. ప్రజల ప్రశ్నలకు క్రెయిగ్ సమాధానం ఎప్పుడూ ఒకేలా ఉండేది – “ఎందుకు చేయకూడదు? చేయండి.” మనోడు ఈ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసిన సమయంలో ఎలాంటి ఫీజులు, ప్రకటనలు లేవు, ముందు అసలు మనోడికి డబ్బు సంపాదించే ప్రణాళిక లేదు.
ఈ వెబ్‌సైట్ ప్రజలకు క్రమంగా ఒక అవసరంగా మారింది. దాన్ని ఉపయోగించిన ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు చెప్పడం ప్రారంభించారు. మార్కెటింగ్, ప్రకటనలు లేకుండా, క్రెయిగ్స్‌లిస్ట్ పేరు నోటి మాట ద్వారా జనాల్లో విశేషంగా వ్యాపించింది. ప్రజలు వెబ్‌సైట్‌ను తమ జీవితంలో భాగం చేసుకున్నారని క్రెయిగ్ చూసిన తర్వాత, వెబ్‌సైట్‌లో అన్ని పోస్ట్‌లను ఒక క్రమపద్ధతిలో ప్రచురించడం ప్రారంభించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వెబ్‌సైట్ డిజైన్ సరళమైనది, ఫ్యాన్సీ లోగో కూడా లేదు, ఫ్యాన్సీ బ్రాండింగ్ అస్సలే లేదు. నలుపు, తెలుపు పేజీలో జాబితా చేయబడిన సమాచారం మాత్రమే ఈ వెబ్‌సైట్‌లో ప్రజలకు కనిపిస్తుంది. అయితేనేం ప్రజలు ఇప్పటికీ ఈ వెబ్‌సైట్‌ను ఇష్టపడుతున్నారు.
2025 లోనూ క్రెయిగ్స్‌లిస్ట్ మంచి ఉదాహరణ..
ఈ వెబ్‌సైట్‌లో ఎటువంటి ప్రకటనలు ఖర్చు లేవు. అయినా ఈ వెబ్‌సైట్ ఏటా సుమారు $700 మిలియన్లను సంపాదిస్తుంది. ఆశ్చర్యకరంగా ఉంది కదా.. కానీ ఇది నిజం. కేవలం 60 మంది ఉద్యోగులు ఇంత భారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని మీకు తెలుసా. నేటికీ కంపెనీ ఏ ప్రధాన పెట్టుబడిదారుల నుంచి ఎటువంటి నిధులను సేకరించకపోవడం ఇక్కడ విశేషం.
డబ్బు గురించి కాదు..
క్రెయిగ్స్‌లిస్ట్ కథ కేవలం డబ్బు గురించి కాదు. పని అంటే కేవలం డబ్బు సంపాదించడం గురించి కాకూడదనే ఆలోచన గురించి. ఒక వ్యాపారవేత్త వెబ్‌సైట్ కొనడానికి వచ్చి క్రెయిగ్‌కు $11 బిలియన్లు ఆఫర్ చేశారు.. దానిని ఎవరైనా తిరస్కరించడం కష్టం. కానీ క్రెయిగ్ నవ్వి, “నాకు అది వద్దు. నా దగ్గర ఉన్నది చాలు. నా జీవితం సజావుగా సాగుతోంది, నేను సంతోషంగా ఉన్నాను” అని అన్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో క్రెయిగ్ సమాధానం ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. స్టార్టప్ ప్రారంభించిన వెంటనే ప్రజలు, పెట్టుబడిదారులను వెంబడిస్తున్నప్పటికీ, విజయం డబ్బు ద్వారా మాత్రమే కొలవబడదని క్రెయిగ్ తన జీవితం ద్వారా ప్రపంచానికి మంచి ఉదాహరణగా చూపించారు. నిజమైన విజయం అంటే మీ పనితో సంతోషంగా ఉండటం, ప్రజల జీవితాలను సులభతరం చేయడం.
నేడు ఈ వెబ్‌సైట్ కమ్యూనిటీ కార్యకలాపాలు, సేవలు, గృహ కొనుగోలు, అమ్మకాల నుంచి అద్దె, ఉద్యోగాలు, వేదికలు, రెజ్యూమ్‌ల వరకు విభాగాలను కలిగి ఉంది. వాటిలో అనేక ఉపవిభాగాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రజలు ఇక్కడ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ, సైట్ హోమ్‌పేజీ ఇప్పటికీ ఒకే స్క్రోల్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. స్క్రీన్ పరిమాణం పెద్దదిగా ఉంటే, ఒకే స్క్రోల్ కూడా అవసరం లేదు.
క్రెయిగ్స్‌లిస్ట్ నుంచి మరొక సందేశం ఏమిటంటే.. పెద్ద బ్రాండ్లు, భారీ మార్కెటింగ్, మిలియన్ల పెట్టుబడి మాత్రమే విజయానికి మార్గం కాదు. కొన్నిసార్లు ఒక సాధారణ ఆలోచన, నిజాయితీగల పని, ప్రజల అవసరాలను అర్థం చేసుకోవాలనే మక్కువ మిమ్మల్ని గొప్ప వ్యాపార ప్రణాళికలు కూడా చేరువకాని చోటికి తీసుకెళతాయని చెబుతున్నాయి.
READ ALSO: Tejas Mk-1A: భారత అమ్ముల పొదిలోకి తేజస్ కొత్త మార్క్.. శత్రుదేశాలు వణకాల్సిందే..