Business Headlines: ప్రపంచ బ్యాంక్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మీత్ గిల్ సెలెక్ట్ అయ్యారు. ఈ పదవిని చేపడుతున్న రెండో భారతీయుడిగా పేరొందారు. సెప్టెంబర్ ఒకటిన బాధ్యతలు చేపడతారు. 2012-16 మధ్య కాలంలో తొలిసారిగా కౌశిక్ బసు ఈ హోదాలో పనిచేశారు. ఇందర్మీత్ గిల్ ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్‌లోనే ఈక్విటబుల్ గ్రోత్, ఫైనాన్స్, ఇన్‌స్టిట్యూషన్ డిపార్ట్‌మెంట్లకు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
పదేళ్లలో 9661 కోట్ల గోల్డ్ సీజ్
గడచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా 9 వేల 661 కోట్ల రూపాయల విలువైన స్మగ్లింగ్ బంగారాన్ని సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. మనీ లాండరింగ్ కింద ఈడీ గత పదేళ్లలో 15 కేసులను బుక్ చేసినట్లు చెప్పారు. ఫెమా చట్టం కింద 29 కేసుల్లో దర్యాప్తు చేపట్టిందని పేర్కొన్నారు.
read more: తమ 100వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లు
తగ్గిన సహజ వాయువు వాడకం
విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, చమురు శుద్ధి కేంద్రాలు, పెట్రో కెమికల్ ప్లాంట్లు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగిస్తుండటంతో దేశంలో సహజ వాయువుకి డిమాండ్ తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలలతో పోల్చితే ఈ ఏడాది 2 పాయింట్ 5 శాతం వాడకం తగ్గింది. ఫలితంగా దిగుమతులు 10 శాతం పడిపోయాయి.
‘సన్’ షేర్లు అమ్మిన ఎల్‌ఐసీ
సన్ ఫార్మాలోని మొత్తం షేర్లలో 2 శాతం వాటాలను అమ్మినట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. షేర్ల అమ్మకంతో 3 వేల 882 కోట్ల రూపాయలు పొందినట్లు సెబీకి తెలిపింది. 2021 మే 17 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలో వాటాలను విక్రయించినట్లు పేర్కొంది. దీంతో సన్ ఫార్మాలోని ఎల్‌ఐసీ షేర్ల సంఖ్య 16 కోట్ల నుంచి 12 కోట్లకు పడిపోయింది.
3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు
2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి నిన్నటి వరకు 3 కోట్లకు పైగా ఐటీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించేందుకు ఈ నెల 31వ తేదీని చివరి గడువుగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. గడువు పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పటంతో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీఆర్‌లు శరవేగంగా దాఖలవుతున్నాయి.
‘5జీ’ వేలం ప్రారంభం
5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం వేలం ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాతోపాటు ఈసారి అదానీ నెట్‌వర్క్ కూడా ఈ ఆక్షన్‌లో ప్రధాన పోటీదారుగా పాల్గొంటోంది. 5జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం వాడుతున్న 4జీ నెట్‌వర్క్‌తో పోల్చితే 5జీ నెట్‌వర్క్‌లో పది రెట్లు వేగంగా ఆన్‌లైన్ సర్వీసులు అందనున్నాయి.