బిగ్ బాస్ సీజన్ 5లో నామినేషన్స్ ఉన్న సన్నీ మొత్తానికీ తన ఫ్రస్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయిపోయి, వీక్షకులకు వినోదం పంచడం మొదలెట్టాడు. నిజానికి ఆ టాస్క్ మొదలు కాకముందే, కెప్టెన్ యానీ మాటలను పట్టించుకోకుండా సన్నీ కేక్ తినేశాడు. దాని వల్ల బిగ్ బాస్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సన్నీ అలా చేయడాన్ని యానీ తప్పు పట్టినా, ఇందులో ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనేది బిగ్ బాస్ ఇంతవరకూ చెప్పలేదు. అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీని మాత్రం కేక్ తినడానికి ఎవరు అర్హులు అని బిగ్ బాస్ అడిగాడు. అత్యధికంగా ఎనిమిది వారాల పాటు నామినేషన్స్ లో ఉన్న రవికి కేక్ ఇవ్వొచ్చునంటూ జెస్సీ చెప్పాడు. కానీ ఎవరికి వారు కేక్ తినడానికి తమకు అర్హత వుందని చెబుతున్న టైమ్ లోనే సన్నీ సైలెంట్ గా దానిని తినేసి ట్విస్ట్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఓల్డ్ టాస్క్ నే ఇంటి సభ్యులకు ఈ వారం ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ ను ఓ హోటల్ గా మార్చామని తెలిపాడు. అందులో వెయిటర్స్ గా శ్రీరామ్, షణ్ముఖ్ ను నియమించాడు. రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ పని యానీ కి, హౌస్ కీపింగ్ పనిని రవికి ఇచ్చాడు. కొత్తగా పెళ్ళి చేసుకుని హనీమూన్ కు ఈ హోటల్ కు వచ్చే జంటగా మానస్, ప్రియాంక నటించాల్సి ఉంది. ఆ హోటల్ మేనేజర్ స్నేహితురాలు, బాగా యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిగా కాజల్, పెద్ద డాన్ కూతురుగా సిరి నటించాలి. ఏమీ తెలియని అమయాకుడు, తొలిసారి ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన వ్యక్తిగా సన్నీ యాక్ట్ చేయాలి. ఇదే సమయంలో బిగ్ బాస్ రవికి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. హోటల్ కు వచ్చే వ్యక్తులను తన పనులతో మెప్పించి, అతను అత్యధికంగా టిప్స్ తీసుకోవాలి. హోటల్ లో పనిచేస్తున్న వారికి టిప్స్ అందుకుండా చూడాలి.
Read Also : “పుష్ప” వీడియో లీక్… బన్నీ మాస్ ఫీస్ట్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
ఈ టాస్క్ మొదలైన దగ్గర నుండి ఎవరికి వారు తమ పాత్రలలో జీవించడం మొదలెట్టారు. డాన్ కూతురైన సిరి ఇదే ఛాన్స్ అని షణ్ముఖ్ తో ఆడుకోవడం మొదలెట్టింది. షణ్ణు అవకాశం చిక్కినప్పుడల్లా, సిరికి కౌంటర్ వేయడం మొదలెట్టాడు. కాజల్ సైతం తన యాటిట్యూడ్ ను బయట పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అయితే, ఆమె పర్సులోని డబ్బుల్ని రవి దొంగిలించినప్పుడు మాత్రం షాక్ కు గురైన కాజల్… కాసేపు పాత్రలోంచి బయటకు వచ్చేసి, డబ్బులు పోయిన విషయాన్ని ప్రతి ఒక్కరి దగ్గర ప్రస్తావించడం మొదలెట్టింది. మానస్, ప్రియాంక జోడీ అసలైన కామెడీని అందించడం ఇంకా మొదలు పెట్టలేదు. అందరిని లోకి అత్యధికంగా పాత్రను పండించింది మాత్రం సన్నీనే! పంచ్ డైలాగ్స్ తో ఒక్కొక్కరినీ అతను ఆడుకోవడం మొదలెట్టాడు. అంతేకాదు స్పాంటేనియస్ గా కామెడీని సృష్టిస్తూ ఆ పాత్రలో జీవించడం ప్రారంభించాడు. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ చూస్తూ, వీక్షకులు పడిపడి నవ్వుకున్నది బుధవారం ఎపిసోడ్ చూసే అంటే అతిశయోక్తి కాదు!