గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా బొజ్జ వినాయకుడు కొలువుతీరనున్నాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు. అయితే.. దేశ స్వతంత్య్రకాంక్షను రగిలించడంకోసం, యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
READ MORE: Paralympics: పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న భారతదేశ పతాకధారులు ఎవరంటే..?
ఇదిలా ఉండగా.. వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివపార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. ప్రజల హృదయాల్లో సంస్కృతి, దేశభక్తిని సజీవంగా ఉంచేందుకు ఛత్రపతి శివాజీ ఈ పండుగను ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. పీష్వా పాలించిన మహారాష్ట్ర వరకు ఇది కొనసాగింది. మరో కథనం ప్రకారం.. ఈ గణపతి పండుగను బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుని, ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజులకు, తొమ్మిది రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 రోజుల తర్వాత శోభయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు.