Lord Hanuman: మనదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లో కచ్చితంగా హనుమంతుడి గుడి ఉంటుంది. దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరూ హనుమంతుడిని తప్ప కుండా ఆరాధిస్తారు. కానీ రెండు గ్రామాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకంగా రామ ధూత హనుమంతుడిని బహిష్కరించాయి. వాస్తవానికి.. మన దేశంలోని దాదాపు అన్ని గ్రామాలు దేవుళ్లు, దేవతలకు అంకితమై ఉంటాయి. ఒక్కో ఊరిలో ఒక్కో గ్రామ దేవీదేవతలు ఉంటారు. కానీ కొన్ని అరుదైన గ్రామాలు మాత్రం భిన్నమైన సంప్రదాయాలను పాటిస్తున్నాయి. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లోని బిస్రఖ్ గ్రామంలో రావణుడిని పూర్వీకుడిగా భావించి పూజిస్తారు. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది. అక్కడి ప్రజలు రాక్షసుడైన దైత్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. ఈ కారణంగా ఆ గ్రామాల్లో హనుమాన్ ఆలయాలు ఉండవు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ గ్రామంలో మారుతి (Maruti) కంపెనీ కార్లు కూడా కనిపించవు. “మారుతి” అనే పేరు సంస్కృతంలోని “మరుత్” (గాలి) అనే పదం నుంచి వచ్చింది. వాయు పుత్రుడు అయిన హనుమాన్ పేరు కావడంతో గ్రామస్థులు ఆ పేరుని కూడా దూరంగా ఉంచుతారు. ఆ గ్రామాల్లో మొదటిది మహారాష్ట్రలోని నందూర్ నింబ దైత్య. ఇది అహ్మద్‌నగర్ జిల్లా పాఠర్ది తాలూకాలో ఉంది.
నందూర్ నింబ దైత్య స్టోరీ..
నందూర్ నింబ దైత్య గ్రామ సంప్రదాయం వెనుక ఒక కథ ఉంది. నింబ దైత్యుడు అనే రాక్షసుడు, హనుమాన్ మధ్య ఒకానొక సందర్భంలో సంఘర్షణ జరిగింది. ఇందులో నింబ దైత్యుడు ఓడిపోయాడు. అప్పటి నుంచి ఆ రాక్షసుడు శ్రీరాముని భక్తుడిగా మారాడని స్థానికుల నమ్మకం. ఆ తరువాత నింబ దైత్యుడు శ్రీరాముడిని ప్రార్థించగా, రాముడు అతడికి ఓ వరం ఇచ్చారు. ఆ గ్రామానికి అధిష్టాన దేవుడిగా ఉండేలా వరమిచ్చాడు. అప్పటి నుంచే ఆ గ్రామంలో నింబ దైత్యుడిని గ్రామ దేవుడిగా పూజిస్తారు. అయితే.. హనుమంతుడు గ్రామంలోకి వస్తే రాక్షసులను పారదోలుతాడనే నమ్మకం ఉది. దీంతో ఆ గ్రామ దేవుడైన నింబ దైత్యుడిని హనుమంతుడు ఏదైనా చేస్తాడనే భయంతో ఈ గ్రామం ఏకంగా హనుమాను బహిష్కిరించింది. అంతేకాదు.. మారుతి కార్ల విషయంలోనూ ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. 2000వ దశక ప్రారంభంలో డాక్టర్ సుభాష్ దేశ్‌ముఖ్ అనే వైద్యుడు ఆ గ్రామంలో చాలా ప్రసిద్ధి చెందాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోగులు అతని దగ్గరకు వచ్చేవారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అతని క్లినిక్ ముందు క్యూలు కనబడకుండా పోయాయి. కారణం ఏమిటో తెలుసుకుంటే.. ఆయన ఓ మారుతి 800 కారు కొన్నాడు. ఈ కారును చూసి గ్రామస్థులు ఆయన దగ్గరకు రావడం మానేశారు. ఇంకో కథ కూడా ఉంది. మారుతి అనే పేరున్న ఇద్దరు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు నియమించారు. కానీ వారు ఎప్పుడూ పిల్లలకు పాఠాలు చెప్పడానికి రాలేదట. ఇవన్నీ దైత్యుడి ప్రభావమేనని గ్రామస్థులు నమ్మకం. అయితే, ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి భయంకరమైన లేదా హింసాత్మక ఆచారాలు లేవని గ్రామస్థులు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో దైత్యుడిని పూజించే ఏకైక గ్రామమిదేనని వారు గర్వంగా చెబుతారు.
ద్రోణగిరి ఆసక్తికర కథ..
రెండవ గ్రామం ద్రోణగిరి. ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 11 వేల అడుగుల ఎత్తులో ఉండే చిన్న గ్రామం. మొదట చూస్తే ఇది సాధారణమైన కొండల మధ్య ఉన్న గ్రామంలానే కనిపిస్తుంది. రాళ్లు, చెక్కతో చేసిన ఇళ్లు, చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దమైన అడవులు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈ గ్రామ జీవనంలో తరతరాలుగా ఒక కథ అల్లుకుపోయి ఉంది. అదే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. భారతదేశంలో చాలా అరుదైన గ్రామాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడిని పూజించరు. ఈ నమ్మకానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. రామాయణం ప్రకారం.. లంక యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడినప్పుడు, అతని ప్రాణాలను కాపాడేందుకు సంజీవని అవసరమైంది. ఆ ఔషధం హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుందని తెలుసుకున్న రాముడు హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు హిమాలయాలకు చేరుకున్నప్పుడు.. ఏ మొక్క సంజీవనిని గుర్తించలేకపోయాడు. అప్పుడు మొత్తం పర్వతాన్నే ఎత్తుకుని తీసుకెళ్లాడు. ఈ కథను హనుమంతుడి శక్తి, భక్తికి ఉదాహరణగా చెబుతారు. కానీ ద్రోణగిరి గ్రామంలో ఈ కథను భిన్నంగా గుర్తుచేసుకుంటారు. హనుమంతుడు ఎత్తుకెళ్లిన ఆ పర్వతం ద్రోణగిరి పర్వతమే అని అక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు పర్వతంలోని ఒక భాగాన్ని తీసుకెళ్లడం వల్ల తమ పవిత్ర కొండకు నష్టం జరిగిందని వారు భావిస్తారు. ఆ కొండలో ఆధ్యాత్మిక శక్తి ఉందని, అది జీవంతో కూడినదని వారు నమ్ముతారు. హనుమంతుడు ఆ పర్వాతాన్ని తీసుకెళ్లడాన్ని అన్యాయంగా భావిస్తారు. ఈ కారణంగానే ఈ గ్రామంలో హనుమంతుడిని ఎప్పుడూ పూజించలేదు. ఎవరికైనా హనుమంతుడిని పూజించాలనిపిస్తే.. అతన్ని గ్రామం నుంచి వెళ్లగొడతారు.