భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, ఎక్ట్రిక్, సీఎన్జీతో నడిచే కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సోలార్ తో నడిచే కారు కూడా వచ్చేసింది. దేశంలోనే మొట్ట మొదటి కారు ఇది. ఆటో ఎక్స్ పోలో వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది. పట్టణాల్లో షార్ట్ రైడ్ కోసం ఈ కారు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ఈ కారు ఫుల్ ఛార్జింగ్ తో 250 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.
సోలార్ పవర్ తో పని చేయడం వల్ల అదనంగా 3,000 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు చిన్న పరిమాణంలో ఉంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడితో సహా ముగ్గురు కూర్చోవడానికి వీలుంటుంది. ఈ సోలార్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.25 లక్షలు మాత్రమే. ఇది నోవా, స్టెల్లా, వేగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
నోవా ధర రూ.3.25 లక్షలు, స్టెల్లా రూ.3.99 లక్షలు, వేగా రూ.4.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. బ్యాటరీ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. అంటే కారు ధర రూ.6 లక్షల వరకూ పలుకుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్, రిమోట్ మానిటరింగ్, వెహికల్ డయాగ్నిసిస్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో ACతో పాటు Apple Car Play, Android Auto కనెక్టివిటీ సిస్టమ్ కూడా ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ తో వస్తుంది.