న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
మహీంద్రా : మహీంద్రా భారతదేశంలో తన మొత్తం పోర్ట్‌ఫోలియో ధరలను జనవరి 1, 2025 నుంచి మూడు శాతం వరకు పెంచింది. ఈ కంపెనీ కార్లు ఇప్పుడు గతేడాది కంటే ఖరీదుగా మారాయి.
మారుతీ సుజుకి: తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతీ సుజుకీ కార్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. అన్ని మోడళ్లపై 4 శాతం పెంచుతూ.. కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ డిసెంబర్‌లో ధరల పెంపును ప్రకటించింది. ఈ నెల నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
మెర్సిడెస్ బెంజ్ : మెర్సిడెస్ కంపెనీ తన అన్ని మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. 2024లోనే ఈ కారు ధరను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
ఆడి: ఆడి ఇండియా కూడా కార్ల ధరలను 3 శాతం పెంచింది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన దాదాపు 16 మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
బీఎమ్‌డబ్ల్యూ: బీఎమ్‌డబ్ల్యూ 2025 ప్రారంభం నుంచి వాహనాల ధరలను పెంచుతామని డిసెంబర్ 2024లో తెలిపింది. కొత్త సంవత్సరంలో కారు ధరను మూడు శాతం పెంచింది.
హ్యుందాయ్ : హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త సంవత్సరంలో తన మొత్తం శ్రేణి ఉత్పత్తుల ధరలను రూ. 25,000 వరకు పెంచింది.
టాటా: టాటా మోటార్స్ కంపెనీ హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ విభాగాల వరకు అన్ని రకాల మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. టాటా మోటార్స్ కూడా కొత్త సంవత్సరం నుంచి తమ వాహనాల ధరలను మూడు శాతం పెంచింది.
ఎంజీ, కియా, స్కోడా, జీప్ : ఎంజీ మోటార్ ఇండియా తన వాహనాల ధరలను మూడు శాతం వరకు పెంచింది. కియా రెండు శాతం, స్కోడా మూడు, జీప్ ఎస్‌యూవీ రెండు శాతం చొప్పున ధరలు పెంచాయి.